Chandrababu Naidu: 'యోగా డే'పై ప్రజా స్పందన ఉత్సాహాన్నిస్తోంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu on Enthusiastic Response to Yoga Day
  • జూన్ 21న యోగా డే
  • విశాఖలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం
  • రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ
  • నేడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష
ఈ నెల 21వ తేదీన ఏపీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు జరిగిన రిజస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. పూర్తి స్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. జూన్ 21న విశాఖలో 5 లక్షలమంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సూచించారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని... వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు యోగా డే కార్యక్రమానికి వస్తారని... ఎవరు ఎటు వెళ్లాలి... ఎక్కడ కార్యక్రమంలో పాల్గొనాలి... అనే విషయంలో ముందుగానే గైడ్ చేయాలని సీఎం అన్నారు. ట్రాఫిక్ సహా ఏ ఇబ్బందీ ఉండకూడదు... అందరూ నిర్ధేశించిన ప్రాంతానికి చేరుకునేలా చూడాలని స్పష్టం చేశారు. 

యోగా డే కంటే ముందు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. "7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తారు. 14 వతేదీ రాష్ట్రంలో లక్ష ప్రాంతాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్దం చేస్తారు. తద్వారా యోగా డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలి" అని సీఎం వివరించారు. 

మంగళవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో యోగా డే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరయ్యారు. యోగా మంత్‌లో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకో థీమ్‌తో వివిధ వర్గాల ప్రజలతో జిల్లాల్లో నిర్వహిస్తోన్న కార్యక్రమాలకు వస్తున్న స్పందనను అధికారులు వివరించగా... చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ద చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రతి గ్రామం నుంచి యోగా రిజిస్ట్రేషన్లు

ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు వివరిస్తూ...”ప్రతి గ్రామం నుంచి యోగాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అనుకున్న లక్ష్యానికి మించి ఔత్సాహికులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. యోగా కార్యక్రమంలో మూడు రోజుల పాటు పాల్గొనేవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాం. యాప్ ద్వారా కూడా ప్రజలు యోగా సర్టిఫికెట్ పొందవచ్చు. విద్యార్థులు, మహిళలు, డ్వాక్రా సంఘాలు, సామాన్య ప్రజలు... ఇలా అన్ని వర్గాలు విశాఖ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రెండు కోట్లమంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారని అంచానా వేస్తున్నాం. రెండు కోట్ల మందికి రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటి వరకు 1.77 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మొత్తం 2,600 మంది మాస్టర్ ట్రైనర్లు సిద్ధం చేయాలని లక్ష్యం పెట్టుకోగా... 5,353 మందిని గుర్తించాం. వీళ్ల ద్వారా 1.25 లక్షల మందిని ట్రైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా... 1.48 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. మూడు పాటు యోగా సాథన చేసిన వారికి ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ వేళ్లేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా కాంపిటేషన్స్ విషయంలో కూడా అనుకున్న మేర లక్ష్యాలను చేరుకున్నాం” అని సీఎం చంద్రబాబుకు వివరించారు.


Chandrababu Naidu
International Yoga Day
Andhra Pradesh
Visakhapatnam
Yoga registrations
Yoga practice
Narendra Modi
Guinness World Record
Yoga awareness rally
Yoga training

More Telugu News