Nara Lokesh: బీఎస్ఎఫ్ జవాను భూ సమస్యను 24 గంటల్లో పరిష్కరించాం: ఏపీ మంత్రి నారా లోకేశ్!

Nara Lokesh Solved BSF Jawan Land Issue in 24 Hours
  • బీఎస్ఎఫ్ జవాను భూ సమస్యపై మంత్రి లోకేశ్ తక్షణ స్పందన
  • 24 గంటల్లోనే శ్రీ సత్యసాయి జిల్లా జవానుకు ఊరట
  • వైసీపీ నేత కబ్జా చేసిన రెండెకరాల భూమికి విముక్తి
  • సెల్ఫీ వీడియో ద్వారా జవాను ఆవేదన, రంగంలోకి దిగిన అధికారులు
  • సర్వే చేసి, పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించి సమస్య పరిష్కారం
శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, ఉదుకూరు గ్రామానికి చెందిన డి. నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ జవానుగా దేశ సేవలో ఉన్నారు. ఆయన సతీమణి తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమి అమరాపురం మండలం కె.శివరం గ్రామంలో ఉంది. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి, తన రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఈ భూమిని అక్రమంగా కబ్జా చేశారని నరసింహమూర్తి ఆరోపించారు. సరిహద్దుల్లో ఉంటూ తన కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో, ఆయన జమ్మూకశ్మీర్ నుంచే ఓ సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

మంత్రి లోకేశ్ చొరవ... చకచకా కదిలిన అధికారులు

ఈ సెల్ఫీ వీడియో మంత్రి నారా లోకేశ్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సైనికుడికి అన్యాయం జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడి, భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, జవాను కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద రంగంలోకి దిగింది. అమరాపురం తహశీల్దార్, స్థానిక పోలీసు అధికారులు కె.శివరం గ్రామానికి చేరుకుని, వివాదాస్పద భూమిని క్షుణ్ణంగా సర్వే చేశారు. రికార్డులను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించుకున్నారు. అనంతరం, పోలీసుల సమక్షంలో భూమికి హద్దులు ఏర్పాటు చేసి, జవాన్ నరసింహమూర్తి కుటుంబానికి ఆ భూమిని అప్పగించారు. దీంతో, గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ భూ వివాదానికి కేవలం 24 గంటల్లోనే శాశ్వత పరిష్కారం లభించింది.

సైనికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి లోకేశ్

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. "దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న మన సైనికుల సంక్షేమానికి, వారి కుటుంబాల రక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న జవాను తన భూమి కోసం ఆవేదన చెందాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. నరసింహమూర్తి ఆవేదన నా దృష్టికి వచ్చిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, 24 గంటల్లో సమస్యను పరిష్కరించాం. సైనికులకు ఎలాంటి సమస్య తలెత్తినా, మా ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా నిలుస్తుంది" అని పునరుద్ఘాటించారు.


Nara Lokesh
BSF Jawan
Land Issue
Sri Sathya Sai District
Andhra Pradesh
YS Jagan Government
Narasiha Murthy
Amarapuram
Land Dispute Resolution
AP Minister

More Telugu News