Raja Raghuvanshi: మేఘాలయలో మధ్యప్రదేశ్ కపుల్ మిస్సింగ్ కేసు.. భర్తను ఎలా చంపారో వెల్లడించిన పోలీసులు

Raja Raghuvanshi Murder Case Meghalaya Police Reveal How Husband Was Killed
  • 11 రోజుల తర్వాత లోయలో భర్త మృతదేహం లభ్యం 
  • బాధితుడి ఫోన్, హత్యకు వాడిన ఆయుధం  స్వాధీనం
  • కొడవలితో దారుణంగా నరికి చంపిన దుండగులు
  • మృతదేహం సమీపంలోనే ఆయుధం గుర్తింపు
  • అదృశ్యమైన భార్య ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు
మేఘాలయ పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన నవ దంపతులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. హనీమూన్ కోసం వచ్చిన ఈ జంట అదృశ్యం కాగా, 11 రోజుల తర్వాత భర్త దారుణ హత్యకు గురైనట్టు తేలింది. ఆయన మృతదేహాన్ని పోలీసులు లోతైన లోయ నుంచి స్వాధీనం చేసుకున్నారు. భార్య ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ తమ హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 23వ తేదీ నుంచి వీరు కనిపించకుండా పోయారు. అంతకు ముందు రోజు అంటే మే 22న ఈ జంట నోంగ్రియాట్‌కు చేరుకుని, షిపారా హోమ్‌స్టే నుంచి మే 23న చెక్ అవుట్ చేసినట్టు చివరిగా గుర్తించారు. వారు అద్దెకు తీసుకున్న స్కూటీని వారు అదృశ్యమైన మరుసటి రోజు సోహ్రారిమ్‌లో గుర్తించారు.

గాలింపు చర్యల అనంతరం సోమవారం రియాత్ అర్లియాంగ్‌లోని వైసాడాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలోని లోతైన లోయలో డ్రోన్ సహాయంతో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. ఆయనను కొడవలి (స్థానికంగా 'దావ్' అంటారు)తో నరికి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం సమీపంలో రాజా మొబైల్ ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు."ఇది కచ్చితంగా హత్యేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాధితుడిని హత్య చేశారు" అని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

అయితే, రాజా భార్య సోనమ్ రఘువంశీ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. "సోనమ్ రఘువంశీ ఇంకా దొరకలేదు. రేపు కూడా అదే ప్రాంతంలో, సమీప ప్రదేశాల్లో గాలింపు కొనసాగిస్తాం. మృతదేహం దొరికిన లోయ దాదాపు ఒకటి రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం సోనమ్‌ను కనుగొనడమే మా ప్రథమ కర్తవ్యం" అని ఎస్పీ వివరించారు. ఈ గాలింపు చర్యల్లో పోలీసులతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ప్రత్యేక కార్యకలాపాల బృందం (ఎస్‌వోటీ) కూడా పాల్గొంటున్నాయి.
Raja Raghuvanshi
Meghalaya
Madhya Pradesh couple
Honeymoon
Missing couple
Murder
East Khasi Hills
Nongriat
Sohra
Crime

More Telugu News