Chandrababu: జూన్ 4.. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్ర‌బాబు

Chandrababu says June 4th a Historic Day in AP Politics
  • నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు
  • నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య
  • వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన
  • కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. నాటి ప్రజాతీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

"జూన్ 4....ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు... ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు... అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు... సైకో పాలనకు అంతం పలికి... ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు... ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు... ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు... పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు....

ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి, సంక్షేమాన్ని అందిస్తూ... అభివృద్ధి పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 

వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్!" అంటూ చంద్రబాబు త‌న 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు.
Chandrababu
AP Elections
Andhra Pradesh Politics
TDP
Janasena
BJP
Coalition Government
State Development
Public Welfare
June 4th

More Telugu News