Pawan Kalyan: జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది: పవన్ కల్యాణ్

Pawan Kalyan on Janasena Party 100 Percent Strike Rate Victory Anniversary
  • ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తి
  • ప్రజా తీర్పుతో నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు జూన్ 4: పవన్
  • గత తప్పిదాలు సరిదిద్దుతూ, స్వర్ణాంధ్ర దిశగా పాలన: డిప్యూటీ సీఎం
  • మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి కృషి
  • జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు
  • రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందని, ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనమని జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచక పాలనను అంతమొందించి, నిరంకుశ పోకడలను ప్రజలు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మార్గం సుగమం చేసిన రోజని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. "దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మార్గనిర్దేశంలో, అలాగే దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, దాడులను ఎదుర్కొని నిలబడిన జనసైనికులు, వీరమహిళల స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారు" అని తెలిపారు. ఎన్డీయే కూటమి చారిత్రక విజయానికి, జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సాధించిన విజయానికి ఏడాది పూర్తయిందని సంతోషం వెలిబుచ్చారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించామని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించేలా కృషి చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. "రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర 2047' దిశగా నడిపించేందుకు, 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక భాగస్వామిగా నిలిపేందుకు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది" అని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా మరింత బాధ్యతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు.
Pawan Kalyan
Janasena Party
Andhra Pradesh
NDA Alliance
Chandrababu Naidu
Narendra Modi
AP Elections 2024
Vikshit Bharat 2047
Swarna Andhra 2047
Political Victory

More Telugu News