Rajoli Ethanol Plant: రాజోలిలో ఇథనాల్ చిచ్చు: రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత

Rajoli Ethanol Plant Protest Turns Violent in Jogulamba Gadwal
  • రాజోలిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై రైతుల తీవ్ర ఆగ్రహం
  • పెద్ద ధన్వాడ వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
  • ఫ్యాక్టరీ నిర్మాణానికి కంపెనీ యత్నం, రైతుల అడ్డుపాటు
  • నిర్మాణ స్థలంలో టెంట్లు పీకేసి, సామగ్రి ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • పనిచేయడానికి వచ్చిన కూలీలను రాళ్లతో తరిమికొట్టిన రైతులు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల యత్నం
జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు బుధవారం ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 12 గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూలీలను తీసుకురావడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పరిశ్రమ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ, ఆందోళనకారులు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పీకివేశారు. అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమికొట్టడంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనతో పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులను శాంతింపజేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ, రైతులు తమ ఆందోళన విరమించేది లేదని, పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తుండటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.
Rajoli Ethanol Plant
Rajoli
Ethanol plant protest
Jogulamba Gadwal
Pedda Dhanwada

More Telugu News