Pawan Kalyan: సనాతన ధర్మంలో విడాకులు లేవు... మరి పవన్ కల్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు?: సీసీఐ నారాయణ

CPI Narayana Criticizes Pawan Kalyan on Sanatana Dharma Divorce Question
  • పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు
  • సనాతన ధర్మంలో విడాకులకు తావులేదని, మరి పవన్‌కు ఎలా వర్తిస్తుందని ప్రశ్న
  • మూడు పెళ్లిళ్లు, విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ నారాయణ ఘాటు వ్యాఖ్యలు
  • సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్
  • సనాతన ధర్మం సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే అరాచక సిద్ధాంతమని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీపీఐ అగ్రనేత కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంలో విడాకులకు తావులేదని, మరి పవన్ కల్యాణ్ మూడుసార్లు విడాకులు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ లెక్కన, నాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

పవన్ కల్యాణ్ గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన అంశంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, "మూడు పెళ్లిళ్ల" అంశాన్ని తెరపైకి తెచ్చి తనపై విమర్శలు చేస్తున్నారని నారాయణ అన్నారు. తాను ఆ కోణంలో మాట్లాడలేదని, "సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా?" అని మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. "సనాతన ధర్మంలో విడాకులు లేవు. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, ఎంతటి ఎదవ పనులు చేసినా భార్య అతనితోనే కాపురం చేయాలి. భర్తను వ్యతిరేకిస్తే పాపానికి పోతారని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యను కూడా తగలబెట్టే క్రూరమైన సారాంశం దానిది" అని నారాయణ విమర్శించారు. అలాంటి సిద్ధాంతాన్ని పవన్ కల్యాణ్ నెత్తిన పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు, విడాకులే లేని ధర్మంలో ఆయన ముగ్గురికి విడాకులు ఎలా ఇచ్చారని తాను ప్రశ్నించినట్లు తెలిపారు.

పవన్ కల్యాణ్ ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకున్నారని తాను అనలేదని, విడాకులు తీసుకుని వివాహాలు చేసుకున్న విషయం వాస్తవమేనని, అది తనకు తెలుసని నారాయణ పేర్కొన్నారు. తాను మొదటిసారిగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానని, సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు అది పవన్ కల్యాణ్ కు ఎందుకు వర్తించదని అడిగినందుకే తనపై అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు.

"సనాతన ధర్మం అనేది అరాచకమైనది. అది భారత వ్యవస్థను మొత్తం వెనక్కి తీసుకెళ్లే క్రూరమైన చర్య. అలాంటి క్రూరమైన ఫిలాసఫీని ప్రచారం చేయడం చాలా ఘోరమైనది" అని నారాయణ తీవ్రంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారని, కానీ తాను మాత్రం సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్‌నే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇది మన లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి, సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని కాకుండా, దానిని సమర్థించే వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు.
Pawan Kalyan
Sanatana Dharma
CPI Narayana
Divorce
Andhra Pradesh
Hinduism
Indian Politics
Criticism
Controversy
Three Marriages

More Telugu News