Ayatollah Ali Khamenei: అణు ఒప్పందం: అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ అసంతృప్తి

Ayatollah Ali Khamenei Unhappy with US Nuclear Proposal
  • ఇరాన్‌తో అణు ఒప్పందానికి అమెరికా మళ్లీ యత్నాలు
  • ఒమన్‌లో ఇరు దేశాల మధ్య పరోక్షంగా చర్చలు
  • అమెరికా ప్రతిపాదనను విమర్శించిన ఇరాన్ ఖమేనీ
  • డీల్ కుదరకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెను దెబ్బ
ఇరాన్‌తో అణు కార్యక్రమం విషయంలో ఒక అంగీకారానికి వచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ దిశగా ఇరు దేశాల మధ్య కీలక ముందడుగు పడింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో జరిగిన సమావేశంలో, చర్చలను కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.

అయితే, అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా నుంచి అందిన ప్రాథమిక ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ విమర్శలు గుప్పించారు. అమెరికా ప్రతిపాదన తమ దేశ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు.

"దేశంలో వంద అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించినా, దేశం ఆర్థికంగా పరిపుష్టి సాధించకపోతే ఆ కేంద్రాల వల్ల ప్రయోజనం ఉండదు. మళ్లీ నిధుల కోసం అమెరికా ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది" అని ఖమేనీ అన్నారు. అయినప్పటికీ, అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చలేదు. అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా చేసిన నిర్దిష్ట ప్రతిపాదనల వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెలుగులోకి రాలేదు.

ఆక్సియోస్ అనే ఒక వార్తా వెబ్‌సైట్ కథనం ప్రకారం, ఇరాన్ తన చుట్టుపక్కల దేశాలతో కలిసి ఒక కన్సార్టియం ఏర్పాటు చేసి యురేనియం శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అమెరికా ఒక ప్రతిపాదన చేసింది. అయితే, ఈ ప్రతిపాదన వల్ల ఇరాన్‌కు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది లేదా నష్టం వాటిల్లుతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఒకవేళ ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరకపోతే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింతగా కుప్పకూలే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చడానికి దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్ అణు ఆయుధాలను సమకూర్చుకోకుండా నిరోధించేందుకు అమెరికా కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, మరోసారి అణు ఒప్పందం దిశగా అడుగులు వేయడానికి ట్రంప్ సర్కార్ సుముఖత చూపింది. ఇటీవల ఒమన్‌లో ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా, ఫలప్రదంగా ముగిశాయని అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు.

అణు ఒప్పందం కుదరని పక్షంలో సైనిక చర్యలకు కూడా వెనుకాడబోమని ట్రంప్ గతంలో హెచ్చరికలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్‌తో గతంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ హయాంలోనే అమెరికా వైదొలగిన విషయం తెలిసిందే.
Ayatollah Ali Khamenei
Iran nuclear deal
US Iran relations
Iran nuclear program
Donald Trump

More Telugu News