YS Sharmila: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు: షర్మిల

Andhra Pradesh Congress Chief YS Sharmila Attacks Jagan and Chandrababu
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది
  • వెన్నుపోటు దినం నిర్వహించిన వైసీపీ
  • వెన్నుపోటు పదానికి జగనే పేటెంట్ రైట్స్ తీసుకున్నారని షర్మిల ఎద్దేవా
  • ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని, ఆయన కూడా వెన్నుపోటుదారుడేనని వ్యాఖ్య
వెన్నుపోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్.... ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి" అంటూ ఏపీ కాంగ్రెస్ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో, ఇవాళ వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడంపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.

వైసీపీ నిర్వహించే 'వెన్నుపోటు దినం' కార్యక్రమానికి ఎలాంటి అర్థం లేదని, రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆమె పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి చురకలంటించారు.

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే, వాటిపై విపక్ష నేతగా పోరాడాల్సిన జగన్ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల విమర్శించారు. "ఏడాది కాలంగా చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే, మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ, పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెబుతుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా ఇంట్లో ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రతిపక్ష హోదా కోసం మారాం చేయడం కూడా వెన్నుపోటే" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

లిక్కర్ స్కాంకు మీరే ఆద్యులని కూటమి దర్యాప్తు చేస్తుంటే, ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలో జరిగిన మద్యం అమ్మకాలపై అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధమని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేయడం "దొంగే... దొంగ దొంగ అని అరిచినట్లుంది" అని షర్మిల తప సోదరుడు జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు

 ఇక, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను 'ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం'గా షర్మిల అభివర్ణించారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన రోజు ఇది అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. "పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేసి, రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామంటూ ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు. అప్పుల సాకు చూపి అభివృద్ధి కార్యక్రమాలను అటకెక్కించి, నిధులు లేవంటూ ప్రజా సంక్షేమానికి మంగళం పాడారు" అని షర్మిల విమర్శించారు. కరెంటు బిల్లుల మోత మోగిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన హామీల ప్రస్తావనే లేదని, ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు కొరవడిందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే నోరు మెదపడం లేదని, విశాఖ ఉక్కును కాపాడతామని హామీ ఇచ్చి, 4 వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని ఆరోపించారు. వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లింలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.

YS Sharmila
Andhra Pradesh
YS Jagan
Congress
Chandrababu Naidu
Super Six Promises
Vizag Steel Plant
AP Politics
YSRCP
TDP

More Telugu News