Nara Lokesh: అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం... అధికారులకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు

Nara Lokesh Orders World Class Cricket Stadium in Amaravati
  • మంత్రి నారా లోకేశ్ నివాసంలో ఉపాధి కల్పన మంత్రుల కమిటీ సమావేశం
  • 11 నెలల్లో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్న లోకేశ్
  • ఈ ప్రాజెక్టుల ద్వారా 8.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని వెల్లడి
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించలేని భారీ పెట్టుబడులను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కేవలం 11 నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రానికి తీసుకువచ్చిందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, ఉపాధి కల్పన మంత్రుల కమిటీ ఛైర్మన్ నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంపై ఏర్పాటు చేసిన మంత్రులు, ఉన్నతాధికారుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు యువతకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం ఒక సమగ్ర స్కిల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి లోకేశ్ అన్నారు. 

బీసీసీఐ సహకారంతో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని, దీని ద్వారా కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, వాట్సాప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 9.20 లక్షల కోట్ల రూపాయల విలువైన 78 భారీ పరిశ్రమలు, అలాగే 13,895 కోట్ల రూపాయల విలువైన 1,19,580 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని మంత్రి లోకేశ్ వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 8.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు, అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్న ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి పెద్ద సంస్థల కోసం ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ)లో పరిశ్రమల వారీగా ప్రత్యేక ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లను (పీఎంయూ) ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు వాస్తవంగా ప్రారంభమయ్యే వరకు ఈ యూనిట్లు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అవసరమైన భూమి కేటాయింపులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి అతిపెద్ద తీరప్రాంతం ఉన్నందున పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, ముఖ్యంగా బీచ్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 

విశాఖపట్నంలో ఒబెరాయ్, వరుణ్ బీచ్ శాండ్స్ వంటి ప్రఖ్యాత స్టార్ హోటళ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడంతో పాటు, ప్రభుత్వం తరఫున విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో బీచ్ శాండ్, కోల్ గ్యాసిఫికేషన్ మైనింగ్ రంగాల్లో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అన్వేషించాలని సూచించారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నందున, ఆయా పరిశ్రమలకు ఆర్థిక చేయూత అందించేందుకు పీఎంఈజీపీ (ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్) పథకంతో అనుసంధానించాలని అధికారులకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో, ఒకవైపు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే, మరోవైపు ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', 'ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ' విధానాలను అమలు చేస్తున్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేశ్ ఉన్నతాధికారులకు సూచించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ కమలాకర్ బాబు, గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Amaravati
Cricket Stadium
Andhra Pradesh
Investments
Job Creation
MSME
Tourism
Skill Development
Economic Development

More Telugu News