Chandrababu Naidu: అధికారులకు కొత్త టార్గెట్ నిర్దేశించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Sets New Target for Officials on P4 Program
  • ఆగస్టు 15 కల్లా 15 లక్షల 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకోవాలని లక్ష్యం
  • 'మార్గదర్శి' నమోదు, దత్తత ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • ఇప్పటివరకు 70 వేలకు పైగా కుటుంబాలకు 'మార్గదర్శుల' ద్వారా సహాయం
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 (ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-పంచాయతీ) కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా 'మార్గదర్శి' నమోదు ప్రక్రియను, దత్తత కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చిన పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) తరహాలోనే ఇప్పుడు పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

నేడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ పీ4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ పేరును 'స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌'గా మార్చాలని సూచించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ పీ4 విధానానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 

రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులను భాగస్వాములను చేసి, వారికి సంపద సృష్టించామని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక మార్గదర్శి దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి పాటుపడేలా చూడాలని అన్నారు. పీ4 కార్యక్రమ పురోగతిని ప్రతి 10 రోజులకు ఒకసారి స్వయంగా సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అనంతరం అధికారులు రూపొందించిన పీ4 లోగో నమూనాలను ఆయన పరిశీలించారు.

పీ4 కార్యక్రమానికి భాగస్వామ్య సంస్థల చేయూత

పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి పలు సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,15,771 కుటుంబాలను 'బంగారు కుటుంబాలు'గా గుర్తించగా, వీరిలో 70,272 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. దత్తత తీసుకున్న కుటుంబాలలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని అధికారులు సమావేశంలో పేర్కొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
P4 program
Poverty eradication
Swarnandhra P4 Foundation
Bangaru Kutumbalu
Margadarsi
Zero Poverty
Amaravati
Land acquisition

More Telugu News