Virat Kohli: ఆర్సీబీ జట్టుకు సన్మానం చేసిన కర్ణాటక ప్రభుత్వం... కోహ్లీ భావోద్వేగం

Virat Kohli RCB Celebrated by Karnataka Government Amidst Tragedy
  • 18 ఏళ్ల నిరీక్షణకు తెర, ఆర్సీబీ తొలి ఐపీఎల్ కప్ కైవసం
  • విజయోత్సవాల నడుమ బెంగళూరులో తీవ్ర విషాదం
  • సీఎం చేతుల మీదుగా విరాట్ కోహ్లీ, జట్టుకు మైసూరు పేటాలతో సత్కారం
  • కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ చారిత్రక విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన వేళ, బెంగళూరు నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, ఈ ఆనందోత్సాహాల నడుమ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.

విధానసౌధలో ఘన సన్మానం

మంగళవారం జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జట్టు సభ్యులను ఘనంగా సత్కరించారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో సహా జట్టు సభ్యులందరికీ సంప్రదాయ మైసూరు పేటాలు చుట్టిన దండలతో సన్మానం చేశారు.

స్టేడియంలో కోహ్లీ ఉద్వేగం

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కూడా ఆటగాళ్లను మైసూరు పేటాలు, దండలతో సన్మానించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, భారీ సంఖ్యలో అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం జట్టు బస్సు స్టేడియంలోకి ప్రవేశించినప్పుడు అభిమానుల చప్పట్లు, సెల్‌ఫోన్ లైట్ల వెలుగులతో వాతావరణం దద్దరిల్లింది. స్టేడియం బాల్కనీ నుంచి రజత్ పాటిదార్ మరోసారి ట్రోఫీని పైకెత్తి చూపించగా సహచర ఆటగాళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ సీజన్ లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మెంటార్ దినేశ్ కార్తీక్ చిరునవ్వుతో కనిపించాడు.

అభిమానులను ఉద్దేశించి మాట్లాడేందుకు విరాట్ కోహ్లీ మైక్ అందుకున్నప్పుడు, అభిమానుల కేరింతలతో ఆయన మాటలు పలుమార్లు వినిపించలేదు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, "మా కెప్టెన్ చెప్పినట్టే, ఇకపై ఇది ‘ఈ సాలా కప్ నమ్‌దే’ కాదు, ‘ఈ సాలా కప్ నమ్దు’ (ఈసారి కప్ మనది). ఈ విజయం మీ అందరిది - అభిమానులు, ఈ నగర ప్రజలు, కష్టసుఖాల్లో ఆర్సీబీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరిది. ప్రపంచంలో మరెక్కడా ఇంతటి గొప్ప అభిమానులను నేను చూడలేదు. ఈ రోజు మన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు మీ అందరి తరఫున భారీగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

చిన్నస్వామి స్టేడియం వద్ద పెను విషాదం

విధానసౌధలో సన్మాన కార్యక్రమం ముగిసిన అనంతరం, సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని భారీ వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి. తమ అభిమాన జట్టును, ఆటగాళ్లను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అయితే, అభిమానుల తాకిడికి తగ్గట్టుగా సరైన భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణ చర్యలు లేకపోవడంతో స్టేడియం వెలుపల తీవ్ర గందరగోళం నెలకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ దుర్ఘటనలో అభిమానులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జరుగుతున్నప్పటికీ, స్టేడియం లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం కొనసాగింది.
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL 2024
Karnataka Government
Chinnaswamy Stadium

More Telugu News