Mallesh Yadav: కుప్పంలో పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన దొంగలు.. కాల్పులు జరిపిన సీఐ!

Kuppam Police Fire on Haryana Robbery Gang Fleeing Checkpost
  • హరియాణా దొంగల ముఠా హల్‌చల్
  • వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు  
  • ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ
  • కారు వదిలి పరారైన ఐదుగురు దుండగులు
  • డాగ్ స్క్వాడ్‌తో దొంగల కోసం వేట
చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరుడుగట్టిన హర్యానా దొంగల ముఠా ఒకటి బీభత్సం సృష్టించింది. పోలీసుల వాహన తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వారిపైకి కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

హర్యానాకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు కుప్పం మీదుగా సరిహద్దు దాటనున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ మల్లేశ్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద మంగళవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్‌ నంబరు గల స్కార్పియో కారును పోలీసులు ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కారు వద్దకు వెళ్తుండగా, అందులోని దుండగులు ఒక్కసారిగా కారును వెనక్కి పోనిచ్చి వారిని ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశారు. అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు త్రుటిలో పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కారులో ఉన్నది దొంగల ముఠానే అని నిర్ధారించుకున్న సీఐ మల్లేశ్ యాదవ్ వెంటనే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. కారు డ్రైవర్ తొడకు తగిలేలా ఒక రౌండ్ కాల్పులు జరిపినట్టు తెలిసింది. అయినప్పటికీ, దుండగులు కారును వేగంగా ముందుకు పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.

వెంటనే స్పందించిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాహనం ఆంధ్ర సరిహద్దు దాటి ఉండకపోవచ్చనే అంచనాతో కుప్పం పురపాలిక పరిధిలోని పలార్లపల్లె, పరమసముద్రం, బేవనపల్లె, వడ్డిపల్లెతో పాటు కుప్పం గ్రామీణ మండలంలోని గోనుగూరు, వెండుగంపల్లె ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పరమసముద్రం చెరువు సమీపంలో దుండగులు తమ స్కార్పియో కారును వదిలిపెట్టి పారిపోయినట్లు గుర్తించారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఐదుగురు ఉండి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ముఠా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ దొంగలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశామని, డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించినట్టు వివరించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు కొనసాగుతోంది.
Mallesh Yadav
Kuppam
Chittoor
Andhra Pradesh
Haryana Robbery Gang
Police Firing
Crime News
Karnataka Registration Car
Palamaneru
Krishnagiri

More Telugu News