Kodali Nani: చంద్రబాబు బూట్లు తుడుస్తానన్న కొడాలి నాని ఎక్కడ?.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Where is Kodali Nani MLA Venigandla Ramu Questions
  • గుడివాడ ప్రజలకు కొడాలి వెన్నుపోటు పొడిచారన్న ఎమ్మెల్యే
  • మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని విమర్శ
  • ఇంకా నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
  • వైసీపీ నేతలు రోడ్లపై డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం
  • గుడివాడ అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
గుడివాడలో తాను ఓడి, కుప్పంలో చంద్రబాబు విజయం సాధిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా.. చంద్రబాబు బూట్లు శుభ్రం చేస్తానని గతంలో సవాల్ విసిరిన మాజీ మంత్రి కొడాలి నాని ఏడాది కాలంగా ఎక్కడ దాక్కున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశ్నించారు. నిన్న గుడివాడ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొడాలి నాని గుడివాడ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, దానికి ఆయన సమాధానం చెప్పాలని నిలదీశారు. 

మంత్రిగా ఉన్న సమయంలో నాని అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతి ద్వారా భారీగా సొమ్ము కూడబెట్టుకున్నారని ఎమ్మెల్యే రాము ఆరోపించారు. చేసిన తప్పులకు సిగ్గుపడి, పశ్చాత్తాపం చెందాల్సింది పోయి ఇంకా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు సాగించిన అరాచకాలు, దుర్మార్గాలకు గత సంవత్సరం ఇదే రోజున ప్రజలు తమ ఓటు ద్వారా సరైన తీర్పు ఇచ్చారని, దానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ‘వెన్నుపోటు దినం’ అంటూ రోడ్ల మీదకు రావడం దారుణమన్నారు.

గడిచిన 20 ఏళ్లుగా గుడివాడ శాసనసభ్యుడిగా కొడాలి నాని అవలంబించిన మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలకు ఆయన జవాబు చెప్పగలరా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు రోడ్లెక్కి నాటకాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కడపలో జరిగిన మహానాడుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, గుడివాడలో తాను సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారని, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
Kodali Nani
Gudivada
Venigandla Ramu
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Telugu Desam Party
YSRCP
Gudivada Constituency
Political Challenge
Political Corruption

More Telugu News