Bengaluru Stampede: తొక్కిస‌లాట‌లో కొడుకును కోల్పోయిన తండ్రి ఆవేదన.. పోస్టుమార్టం వద్దంటూ కన్నీటిపర్యంతం

Bengaluru Stampede Father Pleads Against Postmortem on Son
  • బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ సంబరాల్లో తీవ్ర తొక్కిసలాట
  • ఈ ఘటనలో 11 మంది క్రికెట్ అభిమానులు మృతి, అనేకమందికి గాయాలు
  • కొడుకును కోల్పోయిన తండ్రి చిన్నస్వామి స్టేడియం వద్ద గుండెలవిసేలా రోదన
  • ఉచిత ప్రవేశంతో అంచనాలకు మించి తరలివచ్చిన అభిమానులు
  • సీఎం సిద్దరామయ్య విచారణకు ఆదేశం.. 15 రోజుల్లో నివేదిక
  • ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణ
బెంగ‌ళూరులో నిన్న‌ జరిగిన తొక్కిసలాటలో తన కుమారుడిని కోల్పోయిన ఒక తండ్రి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పోస్టుమార్టం చేయకుండానే తన కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని అధికారులను వేడుకున్నారు. "కనీసం నా బిడ్డ శవాన్ని అయినా ఇవ్వండి. పోస్టుమార్టం చేయకండి. వాడి శరీరాన్ని ముక్కలు చేయకండి" అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదించారు. 

"నాకు ఉన్నది ఒక్కడే కొడుకు. వాడిని కూడా కోల్పోయాను. నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రావచ్చు గానీ, నా కొడుకును ఎవరూ తీసుకురాలేరు కదా" అంటూ ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల నిన్న సాయంత్రం జరిగిన ఆర్‌సీబీ విజయోత్సవ సంబరాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మరణించిన 11 మంది క్రికెట్ అభిమానుల్లో ఆయన కుమారుడు ఒకరు. ఈ ఘటనలో డజన్ల కొద్దీ అభిమానులు గాయపడ్డారు. గురువారం ఉదయానికి మృతదేహాలన్నింటికీ పోస్టుమార్టం పూర్తిచేసి, కుటుంబసభ్యులకు అప్పగించారు.

స్థానిక ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలవడంతో  ఆ విజయాన్ని పురస్కరించుకుని భారీ సంబరాలకు పిలుపునిచ్చారు. ఈ విజయం రాష్ట్రంలో ఒక ఉద్వేగభరితమైన అంశంగా మారింది. ప్రవేశం ఉచితం కావడంతో ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు.

స్టేడియం లోపల సంబరాలు జరుగుతుండగా, బయట పరిస్థితి అదుపుతప్పింది. అంచనాలకు మించి జనం రావడంతో స్టేడియంకు ఉన్న ఇరుకైన ప్రవేశ మార్గాలు కిక్కిరిసిపోయాయి. స్టేడియంలో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరవ్వాలన్న ఆత్రుతతో వేలాది మంది ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.

సాయంత్రం 5 గంటల సమయానికి ఘోరం జరిగిపోయిందని స్పష్టమైంది. మరణించినవారు, గాయపడినవారే కాకుండా, సన్మాన కార్యక్రమానికి వచ్చిన చాలామంది స్పృహతప్పి పడిపోయారు. గాయపడినవారిని, అపస్మారక స్థితిలో ఉన్నవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై విచారణకు సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. పదిహేను రోజుల్లో నివేదిక అందజేయాలని సూచించారు. వేదిక వద్ద జనం అధికంగా గుమికూడటంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు తెలిపారు. కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని ఆయన అన్నారు.

బెంగళూరు దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. "ఈ విషాద సమయంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్ర‌ధాని పేర్కొన్నారు.
Bengaluru Stampede
Siddaramaiah
RCB victory celebration
Chinnaswamy Stadium
IPL title
DK Shivakumar
Narendra Modi
Karnataka news
Cricket fans

More Telugu News