Sharmistha Panoly: శర్మిష్టకు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయమూర్తికి చంపుతామని బెదిరింపులు

Sharmistha Panoly Judge Receives Death Threats After Bail Denial
  • జస్టిస్ పార్థ సారథి ఛటర్జీని అంతమొందించాలంటూ ఎక్స్‌లో పోస్టులు
  • నకిలీ ప్రొఫైల్ చిత్రాలతో ఉన్న అజ్ఞాత ఖాతాలు నుంచి బెదిరింపులు
  • జడ్జి వ్యక్తిగత వివరాలు, చిరునామా సేకరించేందుకు యూజర్ల యత్నం
వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియో కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీకి బెయిల్ నిరాకరించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థ సారథి ఛటర్జీకి తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. ‘ఎక్స్’ వేదికగా పలు అజ్ఞాత ఖాతాల నుంచి ఆయనను లక్ష్యంగా చేసుకుని కాల్చివేయాలంటూ పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. ఈ బెదిరింపుల వెనుక అనేక నకిలీ ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 3న శర్మిష్ఠ పనోలీ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ తిరస్కరించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమె అరెస్టయ్యారు. బెయిల్ నిరాకరించిన కొన్ని గంటల్లోనే జస్టిస్ ఛటర్జీకి ఎక్స్ వేదికగా బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో గత డిసెంబర్‌లో యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రయాన్ థాంప్సన్‌ను కాల్చి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లూయిగీ మాంగియోన్‌ను ఉద్దేశించి ‘అజ్ఞాత గన్‌మెన్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ బెదిరింపులు రావడం గమనార్హం.

‘తోశాలి’ అనే ఎక్స్ యూజర్ "ఈ నీచుడు పార్థ సారథి ఛటర్జీకి కంబళి కుటాయ్ (తీవ్రంగా కొట్టడం), లేదా కొందరు అజ్ఞాత గన్‌మెన్ అవసరం. హిందువులకు భారతదేశంలో వారి అజ్ఞాత గన్‌మెన్ కావాలి. అటువంటి నీచమైన న్యాయమూర్తులలో ఆ భయం చొచ్చుకుపోవాలి" అని రాశాడు. ‘రోహిత్‌కుమార్23595’ అనే మరో యూజర్ ‘పార్థ సారథి ఛటర్జీని చంపండి’ అని రాసుకొచ్చాడు.

ఈ బెదిరింపులను ‘ఇండియా టుడే’ ఫ్యాక్ట్ చెక్ బృందం విశ్లేషించగా అనేక ఖాతాలు అజ్ఞాతంగా ఉన్నాయని, నిజమైన ప్రొఫైల్ చిత్రాలకు బదులుగా కార్టూన్ పాత్రలు, క్రీడాకారులు, నాణేల చిత్రాలను ఉపయోగించారని తేలింది. వీటిలో కొన్ని ఖాతాలు మే నెలలోనే, అంటే కొన్ని రోజుల క్రితమే సృష్టించినవి కావడం గమనార్హం.

కొందరు యూజర్లు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేస్తూ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. మరికొందరు హద్దులు దాటి బహిరంగంగా బెదిరింపులకు దిగుతూ ఆయన వ్యక్తిగత వివరాలు (డాక్సింగ్) సేకరించే ప్రయత్నం చేశారు. "ఆది" అనే పేరుతో ఉన్న ఒక ఖాతా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెబ్‌సైట్‌లోని న్యాయమూర్తి బయోడేటా లింక్‌ను షేర్ చేస్తూ "అతని ఇంటి చిరునామా కనుక్కోగలమేమో చూద్దాం" అని రాసింది. ఈ ఖాతా న్యూయార్క్‌లో ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, ఆ నగరానికి సంబంధించిన పోస్టులు ఏవీ లేవని, కేవలం భారత రాజకీయాలపైనే పోస్టులు ఉన్నాయని విశ్లేషణలో వెల్లడైంది. ‘రూపేష్ రెడ్డి’ అనే మరో ఖాతా "ఎవరికైనా అతని చిరునామా లేదా మొబైల్ నంబర్ తెలుసా? దయచేసి షేర్ చేయండి" అని పోస్ట్ చేసింది.
Sharmistha Panoly
Kolkata High Court
Justice Parthasarathi Chatterjee
Social Media Influencer
Death Threats
Online Abuse
West Bengal Politics
TMC
Fake Accounts
India Today Fact Check

More Telugu News