BSF Jawan: ముర్షిదాబాద్ బోర్డర్‌లో టెన్షన్.. చొరబాటుదారుల చేతికి చిక్కిన భారత సైనికుడు

BSF Jawan Kidnapped at Murshidabad Border Tension
  • పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్‌ను కిడ్నాప్ 
  • చొరబాటును అడ్డుకోబోయిన సైనికుడిపై దాడి, అపహరణ
  • కొన్ని గంటల నిర్బంధం తర్వాత జవాన్ విడుదల
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు దుండగులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను అపహరించి, కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో చర్చలు జరపడంతో ఆ జవాన్ సురక్షితంగా విడుదలయ్యాడు.  

అసలేం జరిగింది?
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది. నుర్పుర్‌ జిల్లాలోని సుతిర బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ సమీపంలోని చాందినీచౌక్‌ వద్ద ఈ తెల్లవారుజామున ఈ అపహరణ యత్నం చోటుచేసుకుంది. కథాలియా అనే గ్రామం వద్ద బంగ్లాదేశ్‌ వైపు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ వారిని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన దుండగులు జవాన్‌పై దాడి చేసి, బలవంతంగా తమతో పాటు బంగ్లాదేశ్‌ భూభాగంలోకి తీసుకెళ్లారు. దుండగులు బంగ్లాదేశ్‌లోని చపాయ్‌ నవాబ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన వారని బీఎస్ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి.

బీఎస్ఎఫ్ స్పందన.. జవాన్ విడుదల
తమ జవాన్ అపహరణకు గురైనట్టు తెలియగానే బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. "మా జవాన్‌ను బంగ్లాదేశ్ జాతీయులు కిడ్నాప్ చేసి కొన్ని గంటల పాటు నిర్బంధించారు. ఈ విషయాన్ని వెంటనే 'బోర్డర్‌ గార్డ్స్‌ బంగ్లాదేశ్‌' (బీజీబీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సత్వర జోక్యంతో కొన్ని గంటల్లోనే మా జవాన్‌ను విడిచిపెట్టారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు" అని సౌత్‌ బెంగాల్‌ ఫ్రంటియర్‌ బీఎస్ఎఫ్‌ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

వైరల్ వీడియో.. దర్యాప్తు ముమ్మరం
బీఎస్ఎఫ్ జవాన్‌ను అరటి చెట్టుకు కట్టేసి ఉన్నట్లుగా చెబుతున్న ధ్రువీకరించని వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కిడ్నాప్‌ ఘటనపై బీఎస్ఎఫ్ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. అదే సమయంలో సరిహద్దు భద్రతా ఏర్పాట్లు, తమ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌లో ఏవైనా లోపాలున్నాయా అనే కోణంలో కూడా బీఎస్ఎఫ్ అధికారులు సమీక్ష జరుపుతున్నారు.

ముర్షిదాబాద్‌లో చొరబాట్ల కలకలం
ముర్షిదాబాద్‌ సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు చాలాకాలంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏప్రిల్‌ నెలలో ఈ ప్రాంతంలో జరిగిన కొన్ని అల్లర్ల వెనుక కూడా ఈ చొరబాటుదారుల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో దాడులకు పాల్పడిన వారిని తామెప్పుడూ చూడలేదని స్థానిక శాసనసభ్యుడే స్వయంగా చెప్పడం గమనార్హం. "అల్లర్లు జరిగిన ప్రాంతం సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. కాబట్టి, ఇక్కడి అస్థిర పరిస్థితుల దృష్ట్యా దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగానే పరిగణిస్తున్నాం. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఇతర జిల్లాల నుంచి గానీ, పొరుగు దేశం నుంచి గానీ వచ్చి ఉండొచ్చు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి" అని అప్పట్లో ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. తాజా ఘటనతో సరిహద్దు భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
BSF Jawan
Murshidabad
West Bengal
Bangladesh Border
Border Security Force
Chorabadu
BGB
Border Guards Bangladesh
Kidnap
Illegal Immigration

More Telugu News