RCB: ఫ్రీ టిక్కెట్ ప్రచారం... చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటకు కారణాలివే!

RCB Chinnaswamy Stadium Stampede Causes and Details
  • ఉచిత పాస్‌లు, గేట్ల మూసివేత, ఊహించని రీతిలో అభిమానులు రావడమే విషాదానికి కారణమని ప్రాథమిక అంచనా
  • అంచనాలకు మించి తరలి వచ్చిన అభిమానులు
  • నియంత్రణ వైఫల్యం అంటూ ఆరోపణలు
  • పరేడ్ ప్రకటనల్లో గందరగోళం కూడా కారణమే!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరిన వేళ, విజయోత్సవ సభ విషాదానికి దారి తీసింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. తొక్కిసలాటకు ఉచిత పాస్‌లు ఇస్తున్నారనే వదంతులు వ్యాపించడం, స్టేడియం గేట్లను మూసివేయడం, ఊహించని రీతిలో జనం పోటెత్తడం వంటి అంశాలు కారణమయ్యాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

అంచనాలకు మించి అభిమానుల తాకిడి

చిన్నస్వామి స్టేడియం వాస్తవ సామర్థ్యం 35 వేల మంది మాత్రమే కాగా, బుధవారం సాయంత్రానికి దాదాపు మూడు లక్షల మంది అభిమానులు స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు. స్టేడియంలో మొత్తం 21 స్టాండ్‌లు, 13 గేట్లు ఉన్నాయి. వీటిలో 9, 10 నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుల కోసం కేటాయించారు. మిగిలిన గేట్లలో 5, 6, 7 నంబర్ గేట్ల ద్వారా అభిమానులను లోపలికి అనుమతించారు. ముఖ్యంగా, 7వ నంబర్ గేటు నుంచి స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్సీబీ జట్టు ఇదే మార్గం గుండా మైదానంలోకి వస్తుందన్న ఉద్దేశంతో అభిమానులు అత్యధిక సంఖ్యలో ఈ గేటు వద్దకే చేరుకున్నారు.

పాస్‌లు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి ప్రవేశం కల్పించారు. అయితే, పాస్‌లు లేనివారు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో, 7వ నంబర్ గేటు వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో, టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని, ఎక్కువ నష్టం ఈ గేటు వద్దే సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

నియంత్రణ వైఫల్యం

స్టేడియం వద్ద రద్దీని అదుపు చేసేందుకు సుమారు 5 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ, ఊహించిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా అభిమానులు తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. స్టేడియం గేట్లు కూడా ఇరుకుగా ఉండటం వల్ల అభిమానులు లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. "స్టేడియం గేట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. జనం కిక్కిరిసిపోవడంతో కొన్ని గేట్లు విరిగిపోయాయి. అంచనాలకు మించిన రద్దీ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నాం" అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అయితే, తమ వద్ద పాస్‌లు ఉన్నప్పటికీ, గేట్లు మూసివేసి లోపలికి అనుమతించలేదని కొందరు అభిమానులు ఆరోపించారు.

ప్రకటనల్లో గందరగోళం, ఉద్రిక్తత

బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ జట్టు విజయోత్సవ పరేడ్ నిర్వహిస్తుందని ఆ జట్టు యాజమాన్యం తొలుత ప్రకటించింది. అయితే, అభిమానుల భారీ రాకను ముందే ఊహించిన పోలీసులు, శాంతిభద్రతల దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఆర్సీబీ జట్టు పరేడ్ ఉండదని, కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11.56 గంటలకు స్పష్టం చేశారు.

కానీ, మధ్యాహ్నం ఆర్సీబీ యాజమాన్యం మరోసారి ప్రకటన చేస్తూ, పరేడ్ యథావిధిగా జరుగుతుందని, అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పరేడ్ జరుగుతుందో లేదో తెలియని అయోమయంతో, చాలామంది నేరుగా మైదానంలోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో, టికెట్లు లేని కొందరు గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని, దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు.
RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
IPL Trophy
Bangalore Stampede

More Telugu News