Anushka Sharma: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్

Anushka Sharma Reacts to Bengaluru Stampede Tragedy
  • హృదయం ముక్కలైందన్న అనుష్క శర్మ
  • తొక్కిసలాట ఘటన కలచివేసిందన్న కమల్ హాసన్
  • ఇలాంటి సమయంలో దయచేసి వదంతులు నమ్మకండని ఆర్ మాధవన్ ట్వీట్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందించారు. ఆర్సీబీ యాజమాన్యం చేసిన ప్రకటనను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. "ఈ దురదృష్టకర సంఘటనల పట్ల మేం తీవ్ర ఆవేదన చెందుతున్నాం. అందరి భద్రత, శ్రేయస్సే మాకు అత్యంత ముఖ్యం. మృతుల కుటుంబాలకు ఆర్సీబీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది" అని ఆర్సీబీ యాజమాన్యం పేర్కొంది. దీనిని ఇన్‌స్టాలో పోస్టు చేసిన అనుష్క శర్మ, బ్రోకెన్ హార్ట్ ఎమోజీలను జత చేశారు. హృదయం ముక్కలైందని ఆమె రాసుకొచ్చారు. విరాట్ కోహ్లీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో స్పందించారు. "మాటలు రావడం లేదు. తీవ్రంగా కలత చెందాను" అని పేర్కొన్నారు.

నటుడు కమల్ హాసన్ ఎక్స్ వేదికగా విచారాన్ని వ్యక్తం చేశారు. "బెంగళూరులో హృదయ విదారక విషాదం. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ఆయన తెలిపారు.

నటుడు ఆర్. మాధవన్ ఈ ఘటనను ఒక మేల్కొలుపుగా అభివర్ణించారు. "ఇది చాలా హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దయచేసి బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉండండి. అధికారులతో నిర్ధారించుకోకుండా వదంతులను నమ్మవద్దు" అని ఆయన అన్నారు.

"బెంగళూరులో ఐపీఎల్ సంబరాల్లో జరిగిన విషాదంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఏ సంబరం కూడా ప్రాణం కంటే విలువైనది కాదు. బాధిత కుటుంబాలకు, ప్రభావితమైన వారందరికీ నా ప్రార్థనలు" అని నటుడు సోనూసూద్ ట్వీట్ చేశారు. "క్రికెట్‌లో సమష్టి ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఆప్తులను కోల్పోవడం నిజంగా విచారకరం. మీ బాధలో మేం పాలుపంచుకుంటున్నాం" అని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు.

"విజయోత్సవ సంబరాల్లో మరణం చాలా బాధాకరం. ఈ బాధను తట్టుకునే శక్తిని ఆ దేవుడు మృతుల కుటుంబ సభ్యులకు ప్రసాదించాలి. మీ అభిమానం, మీ ప్రేమ మా కుటుంబానికి బాధ కలిగించకూడదు" అని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.

అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నేతృత్వంలోని పీఆర్కే ప్రొడక్షన్స్ కూడా బాధిత కుటుంబాలకు సంఘీభావంగా తమ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. "అందమైన క్షణాలను జరుపుకుంటున్న తరుణంలో ఘోర విషాదం జరిగింది. బాధితుల బాధలో మేం పాలుపంచుకుంటున్నాం. 'ఎక్కా' సినిమా నుంచి 'బంగిల్ బంగారి' పాట విడుదలను వాయిదా వేస్తున్నాం" అని అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తెలిపారు.
Anushka Sharma
Virat Kohli
RCB
Bengaluru
Chinnaswamy Stadium
Kamal Haasan
IPL

More Telugu News