YS Sharmila: వాళ్ల ఆవేదన పట్టించుకోండి... మంత్రి నారా లోకేశ్ కు షర్మిల విజ్ఞప్తి

YS Sharmila Appeals to Minister Nara Lokesh on DSC Aspirants Concerns
  • ఏపీలో రేపటి నుంచి మెగా డీఎస్సీ
  • డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనను పట్టించుకోవాలన్న షర్మిల
  • మంత్రి లోకేశ్‌ ను ఉద్దేశిస్తూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయమై లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఆమె పలు కీలక సూచనలు చేస్తూ, అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని కోరారు. 

డీఎస్సీ విషయంలో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని షర్మిల పేర్కొన్నారు. "విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారూ, రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పరీక్ష సమయానికి కేవలం 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?" అని ఆమె ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదని, అభ్యర్థులను మోసం చేసే 'దగా డీఎస్సీ' అని వారు వాపోతున్నారని షర్మిల తెలిపారు.

కనీసం 90 రోజుల ప్రిపరేషన్ సమయం ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని, కేవలం 45 రోజుల్లో మొత్తం సిలబస్ చదవడం సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆమె వివరించారు. "మూడున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల పట్ల ప్రభుత్వం కనికరం చూపాలి. వారు మీకు లేఖల మీద లేఖలు రాస్తున్నా స్పందించకపోవడం, నిరుద్యోగుల మొరను పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనం" అని షర్మిల విమర్శించారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరడాన్ని రాజకీయ కుట్రగా మంత్రి లోకేశ్ అభివర్ణించడం ఆయన తొందరపాటు నిర్ణయానికి అద్దం పడుతోందని ఆమె అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెబుతూ, డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని షర్మిల కోరారు. "90 పాఠ్య పుస్తకాలను కేవలం 45 రోజుల్లో అభ్యర్థులు ఎలా చదవగలరో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై తక్షణమే పరిశీలన చేయాలి" అని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా డీఎస్సీ పరీక్షలను ఒకే జిల్లా, ఒకే పేపర్ విధానంలో నిర్వహిస్తే బాగుంటుందన్న అభ్యర్థుల వాదనపై కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలని షర్మిల కోరారు.
YS Sharmila
AP Congress
Nara Lokesh
DSC Exam
Teacher Recruitment
Andhra Pradesh
Education Department
Exam Postponement
DSC Notification
Government of Andhra Pradesh

More Telugu News