Bengaluru Stampede: అంబులెన్స్ రాలేదు.. పోలీసులు సహాయం చేయలేదు: తొక్కిసలాటలో చనిపోయిన‌ టీనేజర్ తండ్రి ఆవేద‌న‌

No Ambulance Cops Didnt Help Father Of Teen Dead In Bengaluru Stampede
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో అపశ్రుతి
  • తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానుల మృతి
  • మృతుల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని దివ్యాంశి
  • తల్లి, అత్తతో వేడుకలకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాలిక
  • నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంపై మృతుల కుటుంబాల ఆగ్రహం
ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో పాలుపంచుకునేందుకు వచ్చిన అభిమానులకు తీవ్ర విషాదం ఎదురైంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీగా తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని సహా 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబరాలకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు..
తొమ్మిదో తరగతి చదువుతున్న దివ్యాంశి అనే 14 ఏళ్ల బాలిక, ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సంబరాల్లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా తన తల్లి, అత్తతో కలిసి బుధవారం చిన్నస్వామి స్టేడియంకు చేరుకుంది. లక్షలాది మంది అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించేందుకు గేట్ నంబర్ 15 వద్ద ఒకరినొకరు తోసుకుంటున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. నిమిషాల వ్యవధిలోనే దివ్యాంశి తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఆమె తల్లి, అత్త ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే దివ్యాంశి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

దివ్యాంశి మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దివ్యాంశి తండ్రి శివకుమార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ, "దివ్యాంశి, ఆమె తల్లి, అత్త మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్టేడియంకు చేరుకున్నారు. గేట్ నంబర్ 15 వద్ద తోపులాటలో నా కూతురు తల ఇనుప బారికేడ్‌కు తగిలింది.. దాంతో ఆమె కిందపడిపోయింది"  అని తెలిపారు. స్టేడియం సమీపంలో మొబైల్ జామర్లు ఉండటం వల్ల కుటుంబ సభ్యులను సంప్రదించి సహాయం కోరడం కూడా కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంశిని ఆమె భార్య, మరదలు ఒక క్యాబ్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారని, అయితే అక్కడి సౌకర్యాలు సరిగా లేవని శివకుమార్ ఆరోపించారు. "వారు నా కూతురిని కనీసం తాకలేదు. నా భార్యే తన బిడ్డకు సీపీఆర్ చేసింది" అని ఆయన వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని, ఘటనా స్థలంలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేదని, పోలీసులు కూడా సహాయం చేయలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్‌లో నాలుగు గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అంతసేపు ఆగగలరని ప్రశ్నించారు. "రాజకీయ నాయకుల సమావేశాలకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎంత మంది వస్తారో అంచనా వేసి, అందుకు తగినట్లుగా పోలీసులు, అంబులెన్స్‌లు, కనీసం ప్రథమ చికిత్స సౌకర్యం అయినా ఏర్పాటు చేయాలి. ఇదే రాజకీయ సభ అయితే బిర్యానీ కూడా ఏర్పాటు చేసేవారు" అని శివకుమార్ మండిపడ్డారు.


Bengaluru Stampede
Divyanshi
RCB victory rally
Chinnaswamy Stadium
IPL trophy celebration
Karnataka government
Fan safety
Crowd control
Police negligence
Sidda Ramaiah

More Telugu News