Corona Virus: మళ్లీ కరోనా కలకలం... 24 గంటల్లో 564 కొత్త కేసులు.. ఏడుగురి మృతి

Indias Active Covid 19 Cases Rise To 4866 And 5 Month Old Among 7 Dead
  • భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కు చేరిక
  • కేరళలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... నిన్న‌టి వ‌ర‌కు 4,302గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య, ఈరోజు 4,866కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో 564 కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే సమయంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు కోవిడ్ కారణంగా మరణించారు. 

మృతుల్లో ఢిల్లీకి చెందిన ఐదు నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విచారకరం. ఆ చిన్నారికి ముందే శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఆరుగురు మృతులు వృద్ధులు కాగా, వీరు మధుమేహం, అధిక రక్తపోటు, న్యూమోనియా వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో చెరో ఇద్దరు చ‌నిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (562), పశ్చిమ బెంగాల్ (538), మహారాష్ట్ర (526), గుజరాత్ (508) రాష్ట్రాలు నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 105 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 44 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని, వీరిలో ఎక్కువ మంది ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు స్వల్ప లక్షణాలతో ఉన్నాయని, బాధితులు హోమ్ కేర్‌లోనే కోలుకుంటున్నారని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అలాగే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు. శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తే, పరిస్థితిని గమనిస్తూ, లక్షణాలు తీవ్రమైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అధికారిక సమాచార వనరులపైనే ఆధారపడాలని అధికారులు ఈ సంద‌ర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Corona Virus
Covid 19
India Covid Cases
Covid Deaths India
Sunitha Sharma
Health Ministry
ICMR
NCDC
Covid Guidelines
Covid India

More Telugu News