RCB: తొక్కిసలాటకు ముందు చేసిన సోషల్ మీడియా పోస్టు ఆర్సీబీ మెడకు చుట్టుకోనుందా?

RCB Victory Parade Stampede Social Media Post Under Scrutiny
  • ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీలో ఘోర ప్రమాదం, 11 మంది దుర్మరణం
  • చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట, 47 మందికి తీవ్ర గాయాలు
  • ర్యాలీ ప్రకటనపై ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్‌సీఏ అధికారులపై విచారణ
  • నిర్వాహకుల వైఫల్యాలే కారణమన్న బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
  • ఘటనపై బెంగళూరు పోలీసులు, మేజిస్టీరియల్ కమిటీ దర్యాప్తు
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చారిత్రక విజయం సాధించిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం నాడు చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో ఘోర తొక్కిసలాట సంభవించి 11 మంది దుర్మరణం చెందగా, 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో, ర్యాలీకి కొన్ని గంటల ముందు ఆర్సీబీ యాజమాన్యం సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ఫ్రాంచైజీ మెడకు చుట్టుకోనుందా అంటే అవుననే సమాధానం వినిపిసోతంది.  ఆర్సీబీ యాజమాన్యం మరియు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) అధికారులపై విచారణకు ఆదేశించారు. ఈ సోషల్ మీడియా పోస్టుపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

18 ఏళ్ల నిరీక్షణ ఫలించి ఆర్సీబీ టైటిల్ గెలవడంతో, జట్టుకు సన్మానం చేసి, విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించాలని ప్రణాళిక వేశారు. ఈ క్రమంలో, జూన్ 4న మధ్యాహ్నం 3:14 గంటలకు ఆర్సీబీ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో "విజయోత్సవ పరేడ్ సాయంత్రం 5 గంటలకు విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ప్రారంభమవుతుందని, అనంతరం స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరుగుతుందని" ప్రకటించింది. ఉచిత పాసుల కోసం లింక్‌ను జతచేస్తూ, "పరిమిత ప్రవేశం" అని పేర్కొంది.

ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి, లక్షలాది అభిమానులు స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు. ఊహించని రీతిలో జనం పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ ఘటనపై స్పందిస్తూ, నిర్వాహకుల వైపు నుంచి కొన్ని లోపాలు జరిగాయని, హడావుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గతంలో ముంబైలో ప్రపంచకప్ విజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన తీరును ఆయన ఉదహరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఈ దుర్ఘటనపై బెంగళూరు పోలీసులు, ఒక మేజిస్టీరియల్ విచారణ కమిటీ దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్సీబీ సోషల్ మీడియా పోస్ట్, కార్యక్రమ నిర్వహణలో లోపాలు దర్యాప్తు పరిధిలోకి రానున్నాయి. 
RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
Bangalore Stampede
KSCA
Fan Event Tragedy
IPL Victory Parade
Karnataka Cricket
Devajit Saikia
BCCI

More Telugu News