Anam Venkata Ramana Reddy: వాళ్లు చిన్న పిల్లకాయలా... మరి నువ్వు కూడా చిన్నపిల్లాడివేనా జగన్ రెడ్డీ?: ఆనం వెంకటరమణారెడ్డి

Anam Venkata Ramana Reddy Slams Jagans Small Children Remark
  • జగన్‌పై ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం
  • గంజాయి, రేప్ కేసుల నిందితులను చిన్నపిల్లలనడంపై మండిపాటు
  • చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదన్న ఆనం
  • 31 కేసుల్లో వాయిదాలు తీసుకుంటున్నారని జగన్‌పై ఆరోపణ
  • లీగల్ ఫీజుల కోసమే రూ.6,904 కోట్లు ఖర్చు చేశారని విమర్శ
  • కేసులు తేల్చుకున్నాకే టీడీపీ గురించి మాట్లాడాలని హితవు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంజాయి, పోలీసులపై హత్యాయత్నం, మహిళలపై అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని జగన్ 'చిన్న పిల్లకాయలు'గా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "గంజాయి, హత్యాయత్నాలు, రేపులు చేసేవారు చిన్న పిల్లకాయలైతే, మరి నువ్వు కూడా చిన్నపిల్లవాడివేనా జగన్ రెడ్డీ?" అని ఆనం సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికిన ఆనం, "మా అధినేతను నడిరోడ్డుపై కొట్టాలన్న నిన్ను దేనితో కొట్టాలి? 31 కేసులు పెట్టుకుని, విచారణకు హాజరుకాకుండా వాయిదాలతో తప్పించుకు తిరుగుతున్న నిన్ను చెప్పుతో కొట్టాలా?" అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. జగన్ ఓటమిపాలై సంవత్సరం గడిచినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తన హయాంలోనే కొందరిపై కేసులు నమోదు చేసి, ఇప్పుడు వారిని పరామర్శించడానికి తెనాలి వెళ్లినప్పుడు ప్రజలు "సీఎం సీఎం" అనడానికి బదులు "ఛీఎమ్ ఛీఎమ్" అన్నారని, ఇది జగన్‌కు సిగ్గుచేటని అన్నారు.

వైసీపీ కార్యకర్తలకు జగన్ ఎలాంటి విలువలు నేర్పుతున్నారని ఆనం ప్రశ్నించారు. "రేపులు చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసులపై హత్యాయత్నాలు చేయండి, మీరు జైలుకు వెళితే నేను వచ్చి పరామర్శిస్తా అని చెబుతున్నారా?" అని నిలదీశారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పోలీసులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అంబటి రాంబాబు పోలీసులను చూసి పళ్లు కొరకడంపై స్పందిస్తూ, "పళ్లు ఊడగొడతారు జాగ్రత్త" అని హెచ్చరించారు. చంద్రబాబును రోడ్డుపై కొట్టాలన్న వ్యాఖ్యలకు జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్‌పై కేసులు నమోదై 5000 రోజులు గడిచిందని, దమ్ముంటే కోర్టుకు వెళ్లి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాతే చంద్రబాబు గురించి మాట్లాడాలని ఆనం సవాల్ విసిరారు. 3,452 సార్లు కోర్టు వాయిదాలు తీసుకోవడం ప్రపంచ రికార్డని, లీగల్ ఫీజుల కోసమే జగన్ రూ.6,904 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. "రోజుకు కోటి 39 లక్షలు ఖర్చుపెట్టి జైలుకు పోకుండా బయట ఉంటున్నావు. నీ కేసులు తేల్చుకునే దమ్ము లేదు కానీ, మా నాయకుల గురించి మాట్లాడతావా?" అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో తన కేసుల విచారణ పూర్తి చేయమని కోర్టును అడిగే ధైర్యం జగన్‌కు ఉందా అని నిలదీశారు.
Anam Venkata Ramana Reddy
Jagan Mohan Reddy
TDP
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Mangalagiri
Crime Allegations
Court Cases
Political Criticism

More Telugu News