Ambati Rambabu: సీఐతో వాగ్వాదం, పోలీస్ కేసుపై అంబటి రాంబాబు రియాక్షన్

Ambati Rambabu Reacts to Police Case and Media Allegations
  • తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్న అంబటి రాంబాబు
  • కొన్ని మీడియా సంస్థలు వార్తలను వక్రీకరిస్తున్నాయని ఆరోపణ
  • పట్టాభిపురం సీఐ... లోకేశ్ ప్రోద్బలంతోనే పనిచేస్తున్నారని విమర్శ
  • గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదులపై సీఐ స్పందించలేదని వెల్లడి
  • ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం
  • వైసీపీ నేతలను భయపెట్టేందుకే ఇలాంటి చర్యలని వ్యాఖ్య
తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, కొన్ని మీడియా సంస్థలు దీనిపై వక్రీకరించిన కథనాలు ప్రసారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తనను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

బుధవారం నాడు తన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని, తనను కలవడానికి వచ్చే కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. తాను బయటకు వెళుతుండగా జేకేసీ కళాశాల సమీపంలో పోలీసులు తనను అడ్డుకున్నారని, ఈ క్రమంలో పట్టాభిపురం సీఐతో వాగ్వాదం జరిగిందని తెలిపారు. అయితే, ఈ ఘటన గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని ఆయన విమర్శించారు. "ఈనాడు పత్రిక అయితే దుంప తెగ, ఎంత దౌర్భాగ్యమైన స్టాండర్డ్స్‌కు దిగజారిందంటే, నేను కలెక్టరేట్ వద్ద దౌర్జన్యం చేశానని ఫ్లాష్ న్యూస్ ఇచ్చింది. నేను ప్రతినిధి బృందంతో వెళుతుంటే అడ్డుకున్నది పోలీసులే... తోసుకుని వెళతామని నేను అన్నానా? రామోజీరావు గారితో పాటు విలువలు కూడా చచ్చిపోయాయా?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు కూడా తనపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు.

తనపైనా, విద్యార్థి నాయకుడు వినోద్‌పైనా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 239/2025 కింద కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నానని తనపై కేసు పెట్టారని, ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. "నేను వెళుతుంటే నన్ను మధ్యలో ఆపి, మీ విధులకు నేను అడ్డం వచ్చానని నా మీద కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. చట్టప్రకారం తేల్చుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

పట్టాభిపురం సీఐ తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు సీఐ... లోకేశ్ ప్రోద్బలంతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని, ఆయన లోకేశ్ బంధువని ఆరోపించారు. గతంలో తాను 'కిర్రాక్ ఆర్పీ', 'సీమరాజా' అనే వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే నెల రోజులు దాటినా కేసు నమోదు చేయలేదని, ఇదే సీఐ "చేస్తాంలే" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గుర్తుచేశారు. "నేను ఎక్స్ మినిస్టర్‌ని. రెండుసార్లు ఫిర్యాదు చేసి ఫోన్ చేస్తే పొగరుగా మాట్లాడారు. లోకేశ్ గారు వేయించిన పోస్ట్ కదా, అందుకే ఆ తలబిరుసు" అని విమర్శించారు. ఇలాంటి అధికారులకు ఈనాడు, టీవీ5, ఏబీఎన్ వంటి మీడియా సంస్థల మద్దతు ఉంటుందని, తాను లోకేశ్, చంద్రబాబులను విమర్శిస్తున్నందుకే తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు.

తాను 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో చూశానని, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచానని అంబటి తెలిపారు. "నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, పెట్టుకోండి చూస్తాను. ఈ కేసులకు భయపడేది లేదు. రాజకీయాల్లో ఉండాలంటే కేసులకు, జైళ్లకు భయపడకూడదు. ఆ రెండూ నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నాం" అని అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. చట్ట వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకునే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. "రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. మమ్మల్ని అణచివేయాలని చూస్తే మరింత ఉప్పెనలా తిరగబడతాం. అది మీకు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది" అని అంబటి రాంబాబు తీవ్ర స్వరంతో అన్నారు.
Ambati Rambabu
YSRCP
Police Case
Guntur
Pattabhipuram CI
Nara Lokesh
Media Bias
Political Conspiracy
Andhra Pradesh Politics
Crime Number 239 2025

More Telugu News