Sanjay Malhotra: ఆర్బీఐ గుడ్ న్యూస్.. తగ్గనున్న ఇంటి, ఇతర రుణాల ఈఎంఐలు

RBI Reduces Repo Rate Home Loan EMIs to Fall
  • ఆర్బీఐ కీలక వడ్డీ రేటు 0.50 శాతం కట్
  • నూతన రెపో రేటు 5.5 శాతంగా నిర్ణయం
  • ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన కమిటీ భేటీ
  • భారత్ వృద్ధి కొనసాగుతుందని ధీమా
  • ద్రవ్య విధాన కమిటీలో ఏకగ్రీవంగా ఆమోదం
దేశ ప్రజలకు, ముఖ్యంగా రుణ గ్రహీతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేటును గణనీయంగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో కొత్త రేటు 5.5 శాతానికి చేరింది. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంది.

ఏకగ్రీవ నిర్ణయంతో ఆమోదం
ప్రతి రెండు నెలలకోసారి జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిరేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై లోతైన చర్చ జరిగిన అనంతరం వడ్డీ రేట్ల తగ్గింపునకు కమిటీ సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రుణగ్రహీతలకు, ప్రత్యేకించి ఇల్లు కొనాలనుకునే వారికి పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీని ఫలితంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గుముఖం పడతాయి. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

ప్రపంచ సవాళ్లున్నా భారత్ వృద్ధిపథంలోనే: ఆర్బీఐ గవర్నర్
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇంకా కొంత బలహీనంగానే ఉందని, ప్రపంచ వాణిజ్య అంచనాలను కూడా తగ్గించారని గుర్తుచేశారు. అయినప్పటికీ, భారతదేశం వేగంగా వృద్ధి చెందుతూనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"భారతదేశ ఆర్థిక బలానికి ఐదు కీలక రంగాల్లోని పటిష్టమైన ఆర్థిక స్థితిగతులే కారణం. భారత ఆర్థిక వ్యవస్థ స్థానిక, విదేశీ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. మనం ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్నాం, భవిష్యత్తులో మరింత వేగంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం" అని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతికి మరింత దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Sanjay Malhotra
RBI
Repo Rate
Interest Rate Cut
Home Loans
EMI
Monetary Policy Committee
Inflation
Economic Growth
Loan Interest Rates

More Telugu News