Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్రిని ప్రారంభించిన మోదీ

Narendra Modi Inaugurates Worlds Highest Railway Bridge
  • చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని
  • బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన మోదీ
  • ఆపరేషన్ సింధూర్ అనంతరం జమ్మూకశ్మీర్ మోదీ తొలి పర్యటన
  •  అంజి వంతెన, రెండు వందేభారత్ రైళ్లను కూడా ప్రారంభించనున్న ప్రధాని
మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ అద్భుతమైన నిర్మాణంతో కశ్మీర్ లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం.

ఈ ఉదయం ఉధంపూర్‌లోని వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి చీనాబ్ వంతెన నిర్మించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఏప్రిల్‌లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దు దాటి చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత (కేబుల్-స్టేయిడ్) రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఇది కూడా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా, శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, శ్రీనగర్ మధ్య రెండు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల రాకతో, మొత్తం 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్ట్ మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఈ పరిణామాలు జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. కాశ్మీర్ లోయకు అన్ని కాలాల్లోనూ నిరంతర రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల కల ఈ ప్రాజెక్టులతో సాకారమవుతోంది.
Narendra Modi
Chenab Railway Bridge
Indian Railways
Udhampur Srinagar Baramulla Rail Link
Anji Bridge
Vande Bharat Express
Jammu Kashmir Development
Kashmir Valley
Rail Connectivity

More Telugu News