Virat Kohli: ఆర్సీబీ విజయోత్సవాల్లో విరాట్ కోహ్లీకి తప్పని ఇబ్బంది!

Virat Kohli Faces Difficulty Amid RCB Victory Celebrations
  • బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో తీవ్ర విషాద ఘటన
  • కోహ్లీ సహా ఆర్సీబీ ఆటగాళ్లకు అభిమానుల తాకిడితో తీవ్ర ఇబ్బందులు
  • విధానసౌధ నుంచి స్టేడియానికి వెళ్తుండగా ఆటగాళ్లను చుట్టుముట్టిన ఫ్యాన్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు ముందు, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో సహా ఇతర క్రికెటర్లు అభిమానుల తాకిడితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే, బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో ఆర్సీబీ ఆటగాళ్లను సత్కరించారు. అనంతరం ఆటగాళ్లు విజయోత్సవాల్లో పాల్గొనేందుకు చిన్నస్వామి స్టేడియానికి బయలుదేరారు. అయితే, విధానసౌధ నుంచి వారు బయటకు వస్తున్న సమయంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వారిని చుట్టుముట్టారు.

ముఖ్యంగా విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ సమయంలో పోలీసులు కూడా భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించలేకపోయారు. దీనికి తోడు వర్షం కురుస్తుండటంతో ఆటగాళ్లను సురక్షితంగా స్టేడియానికి తరలించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. అతికష్టం మీద క్రికెటర్లను అక్కడి నుంచి బయటపడేలా చేసి స్టేడియానికి చేర్చారు.

ఆటగాళ్లు విధానసౌధ నుంచి స్టేడియానికి చేరుకున్న కొద్దిసేపటికే చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. విధానసౌధ వద్ద విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య నుంచి అతికష్టమ్మీద బయటపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానుల తాకిడికి కోహ్లీ దాదాపు చిక్కుకుపోయినట్లు, తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
IPL
Cricket

More Telugu News