KTR: కేటీఆర్‌కు సుప్రీంకోర్టు షాక్: నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

KTR Receives Supreme Court Notice in Corruption Case
  • బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ.25 వేల కోట్ల అవినీతి ఆరోపణల వ్యవహారం
  • కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
  • కేటీఆర్‌కు అనుకూలంగా గతంలో హైకోర్టు తీర్పు... సుప్రీంలో సవాలు చేసిన సుగుణ
  • నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు ధర్మాసనం ఆదేశం
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం, ఈ పిటిషన్‌పై ప్రతివాదిగా ఉన్న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేటీఆర్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
KTR
K Taraka Rama Rao
Telangana Congress
Corruption Allegations
Supreme Court Notice

More Telugu News