Nara Lokesh: ఏఐలో నైపుణ్య శిక్షణ కోసం 'ఎన్ విడియా'తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

Nara Lokesh AP Government Partners with NVIDIA for AI Skill Training
  • ఏఐలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి నారా లోకేశ్ కృషి
  • ఏఐ వర్సిటీ దిశగా కీలక అడుగులు
  • నేడు నారా లోకేశ్ సమక్షంలో కీలక ఒప్పందం
దేశంలోనే ఏఐ ఆధారిత పరిశోధన, నవీన ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా(NVIDIA)”తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉన్నత విద్య అధికారులు, ఎన్ విడియా(NVIDIA) ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 

ఈ ఒప్పందం ద్వారా 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. గతేడాది అక్టోబర్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ముంబైలో సమావేశం అయ్యారు. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా కోరారు. ఇందుకు హువాంగ్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎన్ విడియాతో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 

ఆంధ్రప్రదేశ్ ను ఏఐ పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. రాబోయే సంవత్సరాల్లో 10 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐ యూనివర్శిటీకి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ లు, హార్డ్‌వేర్ సామర్థ్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 

పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యా రంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుంది. విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్‌షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యంగా ఏఐ, స్టార్టప్‌ల అభివృద్ధికి ఇది బలమైన వేదికగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది.

ఈ కార్యక్రమంలో 'ఎన్ విడియా(NVIDIA)' సౌత్ ఏసియా ఎండీ విశాల్ దూపర్, స్ట్రాటజిక్ బిజినెస్ డైరెక్టర్ గణేశ్ మహబాల, ఏవీపీ ప్రైమస్ పార్ట్ నర్ సుమన్ కసానా, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీఎస్ హెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
NVIDIA
AI University
Artificial Intelligence
Skill Development
AP Government
AI Research
Startups
Education

More Telugu News