Tejasvi Surya: ఐపీఎల్ గెలిపించినందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లకు మనం రుణపడి ఉండాలి... తేజస్వి సూర్య సెటైర్

Tejasvi Surya Sarcastic Remarks on Siddaramaiah DK Shivakumar After Bangalore Stampede
  • బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర విమర్శలు
  • సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ వల్లే ఆర్సీబీ కప్ గెలిచిందని వ్యంగ్యం
  • తొక్కిసలాట దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వైనం
ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన, అందులో 11 మంది మరణించడంపై బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లపై ఆయన శుక్రవారం ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

తొక్కిసలాట ఘటన అనంతరం నెలకొన్న గందరగోళం, రాజకీయ దుమారంపై స్పందిస్తూ తేజస్వి సూర్య 'ఎక్స్' వేదికగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. "18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని గెలిపించినందుకు ఆర్సీబీ అభిమానులమైన మేము సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లకు రుణపడి ఉంటాం. వారు మైదానంలో అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి, మా క్లబ్‌కు ఈ అంతుచిక్కని కీర్తిని అందించారు," అంటూ తీవ్రమైన వ్యంగ్యంతో ట్వీట్ చేశారు.

భద్రతా ఏర్పాట్ల వైఫల్యంపై కూడా ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. "ట్రోఫీ గెలిచినందుకు సీఎం, డీకేఎస్ మరియు వారి కుటుంబ సభ్యులను సన్మానించే కార్యక్రమానికి సరైన భద్రతా ఏర్పాట్లు చేయని విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు, ఆర్సీబీ యాజమాన్యం తీరు మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది" అని పేర్కొన్నారు. 

"ఆర్సీబీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయడం మంచిదే. బెంగళూరులో భద్రతకు ప్రాథమికంగా వారే బాధ్యులు!" అంటూ మరో ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. "ఏదేమైనా, సీఎం, డీకేఎస్‌లు ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంకు వెళ్లి... తదుపరి ఐపీఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టొచ్చు" అంటూ తన పోస్టును ఘాటైన చురకతో ముగించారు.

Tejasvi Surya
IPL Trophy
RCB
Siddaramaiah
DK Shivakumar
Bangalore Stampede
Royal Challengers Bangalore
Karnataka Government
Cricket
Chinnaswamy Stadium

More Telugu News