Mohandas Pai: భాషా వివాదం వేళ.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ కీలక వ్యాఖ్యలు

Mohandas Pai comments on language dispute in Karnataka
  • కర్ణాటక ఉద్యోగులు కన్నడ నేర్చుకోవాలన్న మోహన్‌దాస్‌ పాయ్‌
  • ప్రజా వ్యవహారాల్లో స్థానిక భాష వాడాలని సూచన
  • కొందరి అహంకారమే భాషా వివాదాలకు మూలమన్న పాయ్‌
  • బెంగళూరులో కన్నడ మాట్లాడేవారు 33 శాతమే అని వెల్లడి
  • ఎస్‌బీఐ ఉద్యోగి ఉదంతాన్ని ప్రస్తావించిన పాయ్‌
కర్ణాటకలో పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా ప్రజా సంబంధిత రంగాల్లో ఉన్నవారు స్థానిక భాష అయిన కన్నడను తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రముఖ టెక్ ఇన్వెస్టర్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ అన్నారు. కొందరు అధికారులు కన్నడ నేర్చుకునే విషయంలో అహంకారపూరితంగా వ్యవహరించడం తరచూ వివాదాలకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోహన్‌దాస్‌ పాయ్‌ మాట్లాడుతూ, "బెంగళూరు నగరానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వస్తుంటారు. ఇక్కడ స్థానికంగా కన్నడ మాట్లాడే వారు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ చక్కగా స్థిరపడ్డారు. అయితే, కొందరు వ్యక్తులు అహంభావంతో కనీసం కొన్ని కన్నడ పదాలు కూడా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కొన్ని పదాలైనా నేర్చుకుని, వాటిని ఉపయోగిస్తూ స్థానికులకు గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత" అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, బెంగళూరులోని ఎస్‌బీఐ శాఖలో జరిగిన ఓ ఘటనను పాయ్ ప్రస్తావించారు. ఒక బ్యాంకు మేనేజర్ కస్టమర్‌తో కన్నడలో సంభాషించడానికి నిరాకరించిన ఉదంతం తీవ్ర ప్రజా ఆగ్రహానికి దారితీసిందని, ఫలితంగా బ్యాంకు యాజమాన్యం అధికారికంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. "సదరు ఉద్యోగి, 'సార్, నాకు భాష రాదు, కానీ నేర్చుకుంటున్నాను. ప్రస్తుతానికి నా సహోద్యోగి సహాయం తీసుకుంటాను' అని వినయంగా చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ సేవల్లో నిమగ్నమైన ఉద్యోగులు అక్కడి భాష, సంస్కృతిని గౌరవించడం చాలా అవసరమని నొక్కిచెప్పారు. కస్టమర్‌కు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలు అర్థం కాని పక్షంలో, ఉద్యోగులే చొరవ తీసుకుని స్థానిక భాషలో మాట్లాడగలిగేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు.
Mohandas Pai
Karnataka
Kannada Language
Language Dispute
Infosys
SBI Bank

More Telugu News