Nara Lokesh: ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh on Successful Mega DSC in Andhra Pradesh After 7 Years
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారి 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ
  • ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్ణయం
  • నూరు శాతం అక్షరాస్యతే లక్ష్యంగా 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం
  • నైపుణ్యం యాప్ ద్వారా యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు
  • విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం, వీసీల నియామకాల వేగవంతం
  • త్వరలో 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు
నేటి నుంచి ఏపీలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టడం ఒక చారిత్రక ఘట్టమని రాష్ట్ర అభివర్ణించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వయోజన విద్య, సమగ్ర శిక్షా విభాగాల ఉన్నతాధికారులతో సుమారు నాలుగు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటనలు చేశారు.

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ చేపట్టామని అన్నారు. పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నానని వివరించారు. ఇకపై ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామని... మొట్టమొదటి సారిగా 4 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామని చెప్పారు.

"రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను దేశానికి ఆదర్శంగా నిలపడమే మా లక్ష్యం" అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కూడా పారదర్శకంగా, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహిస్తున్నామని, వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.

రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా "అక్షర ఆంధ్ర" కార్యక్రమాన్ని మిషన్ మోడ్‌లో చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. "ప్రస్తుతం రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారిలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉండటం ఆందోళనకరం. రాబోయే మూడేళ్లలో అక్షరాస్యతలో దేశంలోనే తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలవాలి" అని అధికారులకు నిర్దేశించారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు "నైపుణ్యం" యాప్‌ను మరింత పటిష్టం చేయాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులకు సూచించారు. ఉన్నత విద్యలో సంస్కరణల దిశగా, విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే ఏకీకృత చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని, విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగ నైపుణ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. దీనితో పాటు, రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించి, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు చేయూతనివ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, వివిధ విభాగాల డైరెక్టర్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
Nara Lokesh
AP DSC
Mega DSC
Andhra Pradesh Education
Teacher Recruitment
Education Reforms
Literacy Mission
Skill Development
AP Model Education
School Education

More Telugu News