Maganti Gopinath: విష‌మంగానే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై చికిత్స

BRS MLA Maganti Gopinath Health Critical Treatment on Ventilator
  • జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమం
  • గురువారం సాయంత్రం ఛాతీ నొప్పితో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిక
  • ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు
  • ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు
  • అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని రానున్న కేటీఆర్
  • గతంలోనూ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడ్డ మాగంటి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. గురువారం సాయంత్రం ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం, 61 ఏళ్ల మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.

కాగా, మాగంటి గోపీనాథ్ గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడి చికిత్స తీసుకున్నారు. గత ఐదు నెలలుగా ఆయన పలు అవయవాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అనారోగ్యం ఆయన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు టి. హరీశ్ రావు, నామా నాగేశ్వరరావు, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్ తదితరులు శుక్రవారం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా... ఈ విషయం తెలిసి తన పర్యటనను కుదించుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం. ఆయన ఫోన్ ద్వారా గోపీనాథ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో చురుకైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ పార్టీ టికెట్‌పై గెలుపొందిన ఆయన, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. అనంతరం 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Maganti Gopinath
BRS MLA
Jubilee Hills
AIG Hospital
Telangana Politics
Health Condition
Harish Rao
KTR
BRS Party

More Telugu News