Elon Musk: నాసా గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మస్క్.. ట్రంప్‌తో గొడవతో కీలక నిర్ణయం.. మళ్లీ యూ టర్న్!

Musk Trump rupture poses serious threat to NASA Pentagon programs Report
  • ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్రస్థాయిలో వివాదం
  • నాసాకు డ్రాగన్ వ్యోమనౌక సేవలు ఆపేస్తానని మస్క్ బెదిరింపు
  • కొన్ని గంటల్లోనే తన ప్రకటనను ఉపసంహరించుకున్న మస్క్
  • ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దుపై ట్రంప్ హెచ్చరికతో మొదలైన వివాదం
  • నాసా, పెంటగాన్ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం!
  • ట్రంప్ అభిశంసనకు ఎలాన్ మస్క్ పిలుపు
ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య రాజుకున్న వివాదం తీవ్ర పరిణామాలకు దారితీసేలా కనిపించింది. నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) చేరవేస్తున్న ఏకైక అమెరికన్ వ్యోమనౌక అయిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ సేవలను నిలిపివేస్తామని మస్క్ తొలుత బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామం నాసాతో పాటు పెంటగాన్ కార్యక్రమాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని 'ది వాషింగ్టన్ పోస్ట్' ఒక కథనంలో విశ్లేషించింది.

అధ్యక్షుడు ట్రంప్, మస్క్ కంపెనీలకు చెందిన అన్ని ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించడంతో ఈ వివాదం ముదిరింది. దీనికి ప్రతిగా, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని ఆరోపించిన మస్క్.. ఆయన అభిశంసనకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా "అధ్యక్షుడు నా ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానన్న ప్రకటన నేపథ్యంలో స్పేస్‌ఎక్స్ తక్షణమే తమ డ్రాగన్ వ్యోమనౌక సేవలను నిలిపివేస్తుంది" అని మస్క్ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే నాసా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. డ్రాగన్ సేవలు నిలిచిపోతే 100 బిలియన్ డాలర్ల విలువైన ఐఎస్‌ఎస్‌కు అమెరికా వ్యోమగాములను పంపే మార్గం మూసుకుపోతుంది.

అయితే, ఈ బెదిరింపు చేసిన కొన్ని గంటల తర్వాత మస్క్ తన వైఖరిని మార్చుకున్నారు. తాను కాస్త శాంతించి పునరాలోచించాల్సి ఉందని, "సరే, మేం డ్రాగన్ సేవలను నిలిపివేయబోం" అని ఎక్స్‌లో మరో పోస్ట్‌కు సమాధానంగా తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్పేస్‌ఎక్స్ కేవలం నాసాకు మాత్రమే కాకుండా క్షిపణి హెచ్చరికలు, యుద్ధరంగ సమాచార వ్యవస్థలు, ఆయుధాలను కచ్చితమైన లక్ష్యాలకు చేర్చే ఉపగ్రహాల ప్రయోగాలతో సహా పలు కీలక జాతీయ భద్రతా పేలోడ్‌లను ప్రయోగించే కీలక కాంట్రాక్టర్‌గా ఉందని జిన్హువా వార్తా సంస్థ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో స్పేస్‌ఎక్స్‌తో సంబంధాలు తెగిపోతే నాసాతో పాటు పెంటగాన్, ఇతర నిఘా సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని నివేదిక పేర్కొంది.

ఆచితూచి స్పందించిన నాసా
ఈ పరిణామాలపై నాసా ప్రెస్ సెక్రటరీ బెథానీ స్టీవెన్స్ స్పందిస్తూ, స్పేస్‌ఎక్స్ లేకుండా వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు ఎలా పంపిస్తారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేదు. "అంతరిక్షంలో అధ్యక్షుడి దార్శనికతను నెరవేర్చడానికి నాసా కట్టుబడి ఉంది. అంతరిక్షంలో అధ్యక్షుడి లక్ష్యాలను చేరుకోవడానికి మా పరిశ్రమ భాగస్వాములతో కలిసి పనిచేయడం కొనసాగిస్తాం" అని మాత్రమే ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మస్క్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, ఈ వివాదం అమెరికా అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలలో ప్రైవేట్ కంపెనీల ప్రాముఖ్యతను, వాటితో ప్రభుత్వానికి ఉన్న సున్నితమైన సంబంధాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
Elon Musk
SpaceX
NASA
Donald Trump
ISS
Dragon spacecraft
Federal contracts
Space exploration
Pentagon
National security

More Telugu News