Uttar Pradesh: రూ.20 లక్షల విలువైన నగల పర్సు లాక్కెళ్లిన కోతి.. చివ‌రికి!

Monkey snatches devotees purse with Rs 20 lakh jewellery in Vrindavan
  • వృందావన్ బాంకే బిహారీ ఆలయం వద్ద అనూహ్య ఘటన
  • భక్తురాలి నుంచి రూ. 20 లక్షల విలువైన నగల పర్సు లాక్కెళ్లిన కోతి
  • గంటల తరబడి గాలించిన పోలీసులు.. పొదల్లో దొరికిన పర్సు
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం వృందావన్‌లో శుక్రవారం ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఠాకూర్ బాంకే బిహారీ ఆలయ సమీపంలో ఓ భక్తురాలి వద్ద నుంచి కోతి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న పర్సును లాక్కెళ్లింది. ఈ ఘటనతో బాధితులు, అక్కడున్న ఇతర యాత్రికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, కొన్ని గంటల గాలింపు అనంతరం పోలీసులు పర్సును గుర్తించి, ఆభరణాలను సురక్షితంగా బాధితులకు అప్పగించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

యూపీలోని అలీఘర్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఠాకూర్ బాంకే బిహారీ ఆలయ దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఓ కోతి అభిషేక్ అగర్వాల్ భార్య చేతిలో ఉన్న పర్సును లాక్కెళ్లింది. ఆ పర్సులో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితులు తెలిపారు.

"ఆమె (అభిషేక్ భార్య) పర్సులో దాదాపు రూ.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఠాకూర్ బాంకే బిహారీ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా, ఒక కోతి ఆమె నుంచి ఆ బ్యాగ్‌ను లాక్కెళ్లింది" అని సదర్ సర్కిల్ ఆఫీసర్ సందీప్ కుమార్ తెలిపారు.

కోతి పర్సును లాక్కెళ్లిన వెంటనే స్థానికులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికుల సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. కొన్ని గంటల వెతుకులాట త‌ర్వాత‌ సమీపంలోని ఓ పొదలో పర్సును గుర్తించారు. అదృష్టవశాత్తూ, పర్సులోని ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయి. పోలీసులు వాటిని అభిషేక్ అగర్వాల్ కుటుంబానికి అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.

వృందావన్ ప్రాంతంలో కోతులు ఇలా యాత్రికుల వస్తువులను లాక్కెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీ రంగనాథ్‌ జీ మందిరం వద్ద ఓ సందర్శకుడి ఐఫోన్‌ను కూడా ఓ కోతి ఎత్తుకెళ్లిన ఘటన నవ్వులు పూయించింది. 
Uttar Pradesh
Abhishek Agarwal
Vrindavan
Banke Bihari Temple
Monkey
Jewelry theft
Gold ornaments
Aligarh
Theft
Crime

More Telugu News