Volodymyr Zelensky: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా

Russia Attacks Ukraine with 400 Drones and 40 Missiles
  • మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి
  • బాంబుల మోతలతో దద్దరిల్లిన ఉక్రెయిన్ నగరాలు
  • ఆరుగురు మృతి, 80 మందికి గాయాలు
  • ప్రపంచ దేశాల స్పందనపై ఉక్రెయిన్ అధ్యక్షుడి అసంతృప్తి
  • 'ఆపరేషన్ స్పైడర్‌వెబ్'కు ప్రతీకారమేనన్న రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. శనివారం ఉక్రెయిన్‌లోని తొమ్మిది ప్రాంతాలపై రష్యా సేనలు 400కు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులకు పాల్పడ్డాయి. కీవ్, ఎల్వివ్, సుమీ వంటి ప్రధాన నగరాలు ఈ దాడులతో దద్దరిల్లాయి.

ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. "ఈరోజు దేశంలోని అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాం. రష్యా ప్రయోగించిన 400 డ్రోన్లు, 40కి పైగా క్షిపణుల వల్ల 80 మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉండవచ్చు" అని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ దాడుల్లో కీవ్‌లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, లుట్‌స్క్‌లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్‌లో మరొకరు మరణించినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ధ్రువీకరించింది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

రష్యా దాడులపై ప్రపంచ దేశాల స్పందన పట్ల జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "దురదృష్టవశాత్తు, ప్రపంచంలో అందరూ ఈ దాడులను ఖండించడం లేదు. పుతిన్ దీన్నే అవకాశంగా తీసుకుంటున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలనే ఆయన కోరుకుంటున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ఐక్యతను దెబ్బతీసి, తమ యుద్ధానికి మరింత ఒత్తిడి రాకుండా రష్యా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

దౌత్యం ఫలించాలని, భద్రతా హామీలు కల్పించాలని, శాంతి స్థాపనకు తక్షణమే కాల్పుల విరమణ వంటి చర్యలు అవసరమని, దీనికోసం రష్యాపై ఒత్తిడి తేవాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. మరోవైపు, ఉక్రెయిన్ చేపట్టిన 'ఆపరేషన్ స్పైడర్‌వెబ్'కు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Volodymyr Zelensky
Ukraine Russia war
Russia attack
Ukraine drones
Russian missiles
Kyiv
Lviv
Putin
Operation Spiderweb
Ukraine war casualties

More Telugu News