Nagalakshmamma: మహిళా తహశీల్దార్‌పై కొడవలితో దాడి .. నిందితుడు అరెస్టు

Tahashildar Nagalakshmamma Attacked With Sickle in East Godavari District
  • అయినవిల్లి తహశీల్దార్ నాగలక్ష్మమ్మపై కొడవలితో సత్యనారాయణ అనే వ్యక్తి దాడి
  • తహశీల్దార్‌ను పరామర్శించిన కలెక్టర్, ఆర్డీవో
  • ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 
తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండల కేంద్రంలో మహిళా తహశీల్దార్‌పై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేసి గాయపరచడం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని తొత్తరమూడి శివారు జోగిరాజుపాలెంకు చెందిన మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి నిన్న చేతి సంచిలో కొడవలి పట్టుకుని నేరుగా కార్యాలయంలోకి వెళ్లి తహశీల్దార్ నాగలక్ష్మమ్మపై విసిరాడు. దీంతో ఆమె చేతికి గాయమైంది.

సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడని తెలిపారు. గతంలోనూ ఓ నేర సంఘటనలో అతను జైలుకు వెళ్లి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. తన కొబ్బరితోటలు ఇతరులు ఆక్రమించుకున్నారని, భూపత్రాలు ఇప్పించాలంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ అతను తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.

కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ వెళ్తుంటాడని అంటున్నారు. అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు, భూసంబంధిత సమస్యలు లేవని తహశీల్దార్ నాగలక్ష్మమ్మ తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. కాగా, తహశీల్దార్‌ను కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరామర్శించారు. తహశీల్దార్ పై మారణాయుధంతో దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. తహశీల్దార్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించారు. 
Nagalakshmamma
East Godavari
Tahashildar attack
Ayanavilli
Misala Satyanarayana
land disputes
collector Mahesh Kumar
Andhra Pradesh
crime news
Kothapeta RDO Sreekar

More Telugu News