NTR Vidya Sankalpam: డ్వాక్రా మహిళల కోసం ‘ఎన్టీఆర్‌ విద్యా సంకల్పం’

AP Government New Scheme NTR Vidya Sankalpam with 4 Percent Interest Loans
  • ఏపీలో కూటమి సర్కారు మరో కొత్త పథకం
  • స్త్రీనిధి నుంచి 4% వడ్డీకి రూ.లక్ష రుణం
  • ఏడాదికి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు
  • పిల్లల చదువులకు భరోసా కల్పించే నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకం తీసుకురానుంది. డ్వాక్రా మహిళల పిల్లల కోసం ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో తక్కువ వడ్డీకి విద్యారుణం అందించనుంది. స్త్రీనిధి నుంచి కేవలం 4 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ పథకం కోసం ఏటా రూ.200 కోట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

డ్వాక్రా సభ్యులకు ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. అయితే, పిల్లల విద్యాభ్యాసం కోసం ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా తక్కువ వడ్డీకే స్త్రీనిధి ద్వారా విద్యారుణం అందించేందుకు సరికొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేసింది.

ఈ పథకం కింద రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణం ఇస్తారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.  
 
ఖర్చు వివరాలు చెప్పాల్సిందే..
పిల్లల విద్యాభ్యాసం కోసం తీసుకువస్తున్న ఈ పథకం దుర్వినియోగం కాకుండా అధికారులు నిబంధనలు కూడా సిద్ధం చేశారు. ఈ రుణం తీసుకున్న మహిళలు తమ పిల్లల చదువు కోసమే ఆ మొత్తాన్ని వినియోగించాలి. తీసుకున్న రుణంతో ఏం కొనుగోలు చేశామనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. స్కూలు, కాలేజీ ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫాం, సైకిల్ (ఇంటి నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం) కొనుగోలుకు అనుమతిస్తారు. విద్యారుణం ఖర్చుకు సంబంధించిన రసీదులను తల్లిదండ్రులు స్త్రీనిధి అధికారులకు అందించాలి. అదేవిధంగా తీసుకున్న రుణాన్ని 24 నెలల నుంచి గరిష్ఠంగా 36 నెలల వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
NTR Vidya Sankalpam
Andhra Pradesh
Chandrababu Naidu
Dwakra women
Student loan
Sreenidhi loan
Education scheme
AP government schemes
Low interest loan
Education loan

More Telugu News