Jagan: కాగ్ లెక్కలతో రాష్ట్ర ఆర్థిక దుస్థితి బట్టబయలైంది: జగన్

Jagan Slams AP Financial Situation Based on CAG Report
  • ఏప్రిల్ 2025 ఆర్థిక గణాంకాలపై కాగ్ నివేదిక విడుదల
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న జగన్
  • జీఎస్టీ వసూళ్లపై ప్రభుత్వ ప్రకటనలకు, కాగ్ లెక్కలకు భారీ తేడా ఉందని వెల్లడి
  • ఐజీఎస్టీ సర్దుబాటు పేరుతో ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని విమర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు  సంధించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలు తీవ్ర ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, వాస్తవ ఆర్థిక స్థితిగతులకు పొంతన లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు.

జీఎస్టీ వసూళ్లపై ప్రభుత్వ మాయాజాలం

మే 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, 2025 ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి నికర జీఎస్టీ వసూళ్లు రూ. 3,354 కోట్లుగా నమోదయ్యాయని, జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికమని గొప్పలు చెప్పుకుంది. సాంకేతికంగా చూస్తే, అన్ని సర్దుబాట్ల తర్వాత వచ్చేదే నికర జీఎస్టీ. అయితే, కాగ్ విడుదల చేసిన 2025 ఏప్రిల్ గణాంకాలు అసలు నిజాన్ని తేటతెల్లం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే, అంటే  2025 ఏప్రిల్ లో, రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు 2024 ఏప్రిల్ తో పోలిస్తే ఏకంగా 24.20% మేర తగ్గుదల చూపించాయి.

కాగ్ గణాంకాలు బహిర్గతమైన వెంటనే, ప్రభుత్వం మరోసారి మే నెలలో కూడా జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో ఉన్నాయని పేర్కొంటూ ఒక కుట్రపూరితమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో, 2025 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి ముందస్తు కేటాయింపుల సర్దుబాటు కింద రూ. 796 కోట్లు మినహాయించుకుందని, అందుకే జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని పేర్కొంది.

వాస్తవానికి, ఐజీఎస్టీ ముందస్తు కేటాయింపు అనేది ప్రభుత్వ ఖాతాల్లోని మేజర్ హెడ్ 0006 కింద మైనర్ హెడ్ 110 పరిధిలోకి వస్తుంది. ఇది ఒక సాధారణ ప్రక్రియ. అన్ని సర్దుబాట్లను లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీ ఆదాయాలు నిర్ధారిస్తారు. గత సంవత్సరాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. మే 1వ తేదీ ప్రకటనలో 2025 ఏప్రిల్ నికర జీఎస్టీ వసూళ్లు రూ. 3,354 కోట్లు అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు రూ. 796 కోట్లు సర్దుబాటు అయ్యాయని చెప్పడం, కాగ్ ద్వారా జీఎస్టీ ఆదాయాల గురించిన నిజం బయటపడిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టంగా అర్థమవుతోంది.

పన్ను, పన్నేతర ఆదాయాల్లోనూ భారీ క్షీణత

టీడీపీ ప్రభుత్వం చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా, కాగ్ విడుదల చేసిన గణాంకాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే ఆర్థిక మందగమనం మరింత స్పష్టంగా కనిపిస్తోందని సూచిస్తున్నాయి. 2024 ఏప్రిల్ తో పోలిస్తే పన్ను ఆదాయాలు 12.21%, పన్నేతర ఆదాయాలు 22.01% మేర తగ్గుదల నమోదు చేశాయి. రాష్ట్ర సొంత ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే, గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల 12.76%గా ఉంది.

ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత నిరాశాజనకంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టి, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించి, ఆర్థిక క్రమశిక్షణ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది... అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Jagan
YS Jagan
AP Finance
Andhra Pradesh Economy
CAG Report
GST Collections
TDP Government
State Revenue
Economic Slowdown
Tax Revenue

More Telugu News