Chandrababu Naidu: ఎన్విడియాతో ఒప్పందంపై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu on Nvidia Partnership for Andhra Pradesh AI Development
  • రాష్ట్రంలో ఏఐ వ్యవస్థ నిర్మాణానికి ఎన్విడియాతో ఒప్పందం
  • రాబోయే రెండేళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
  • ఏపీకి చెందిన 500 ఏఐ స్టార్టప్‌లకు ఎన్విడియా ఇన్సెప్షన్ ప్రోగ్రామ్‌లో అవకాశం
  • ఎన్విడియా సహకారంతో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక
  • స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ కార్యక్రమం ఒక కీలక అడుగు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలపాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ దిశగా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఎన్విడియాతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి పటిష్టమైన పునాది వేస్తున్నామని. విద్య, నైపుణ్యాభివృద్ధి నుంచి పరిశోధన, ఆవిష్కరణల వరకు ప్రతి అంశంలోనూ ఈ భాగస్వామ్యం కీలకం కానుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

యువతకు నైపుణ్యాభివృద్ధి – భవిష్యత్తుకు భరోసా

మా యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్న మా తపనలో భాగంగా, ఈ ఒప్పందంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశాం. ఎన్విడియా సహకారంతో, రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. వారికి అవసరమైన కరిక్యులమ్, శిక్షణ వనరులను ఎన్విడియా సమకూరుస్తుంది. దీనివల్ల మన విద్యార్థులు ప్రపంచస్థాయి నైపుణ్యాలను అందిపుచ్చుకుని, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు సిద్ధమవుతారు.

స్టార్టప్‌లకు అంతర్జాతీయ వేదిక

నవ కల్పనలకు ఊతమివ్వడం, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 ఏఐ స్టార్టప్‌లకు ఎన్విడియా వారి "ఇన్సెప్షన్ ప్రోగ్రామ్" ద్వారా చేయూతనిస్తాం. ఈ కార్యక్రమం ద్వారా మన స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, వారికి అవసరమైన సాంకేతిక వనరులు, మార్గదర్శకత్వం లభిస్తాయి. తద్వారా రాష్ట్రంలో ఒక బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించగలుగుతాం.

దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం

ఇక, ఏఐ రంగంలో పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్న మా ఆకాంక్షకు అనుగుణంగా, ఎన్విడియా సహకారంతో రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ విశ్వవిద్యాలయం, ఏఐ పరిశోధనలకు కేంద్రంగా, నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం.

ఈ కార్యక్రమాలన్నీ కేవలం సాంకేతిక ప్రగతికే పరిమితం కాకుండా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, తద్వారా మేము కలలుగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి దోహదపడతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. విద్య, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా మన రాష్ట్రాన్ని జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా అంతిమ లక్ష్యం... అని సీఎం చంద్రబాబు వివరించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Nvidia
Artificial Intelligence
AI University
Nara Lokesh
AP Startups
Skill Development
Engineering Students
Inception Program

More Telugu News