Thummala Nageswara Rao: కాళేశ్వరం వివాదంలోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Thummala Nageswara Rao Denies Kaleshwaram Project Involvement
  • కమిషన్ ముందు ఈటల అబద్ధాలు చెప్పారంటూ ఆరోపణ
  • సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని వెల్లడి
  • మేడిగడ్డ అనుమతుల తర్వాతే కమిషన్ వేశారని వ్యాఖ్య
  • సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్లి వివరాలు అందిస్తానన్న తుమ్మల
  • ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చామని స్పష్టీకరణ
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అంశంపై విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట మాజీ మంత్రి ఈటల రాజేందర్ పూర్తిగా అవాస్తవాలు చెప్పారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి తుమ్మల శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, "కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన అనాలోచితంగా వాంగ్మూలం ఇచ్చారా లేక అలాంటి పరిస్థితులు కల్పించారా?" అని ప్రశ్నించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరని హితవు పలికారు. తన హయాంలోని సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన తర్వాతే కమిషన్ వేశారని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో తాను ఛైర్మన్‌గా ఉన్న సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని తుమ్మల తెలిపారు. కేవలం ప్రాణహిత ప్రాజెక్టుపై మాత్రమే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసిందని, ఈ విషయంలో పూర్తి వివరాలను తాను సుమోటోగా కమిషన్ దృష్టికి తీసుకెళతానని మంత్రి ప్రకటించారు.
Thummala Nageswara Rao
Kaleshwaram Project
Etela Rajender
Telangana
Irrigation Project

More Telugu News