Sunil Narang: పవన్ కల్యాణ్ తుపాను లాంటివారు: ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు సునీల్ నారంగ్

Sunil Narang Says Pawan Kalyan is Like a Storm
  • తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కు మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్
  • హీరోలు దేవుళ్లతో సమానం, వారిని ఎవరూ ప్రశ్నించరన్న సునీల్ నారంగ్
  • పవన్ కల్యాణ్ సినిమాను ఆపడం ఎవరితరం కాదన్న సునీల్ నారంగ్
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సునీల్ నారంగ్ ఈ పదవిని చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, పలువురు నిర్మాతలు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సన్మానించి, అభినందనలు తెలియజేశారు.

అనంతరం సునీల్ నారంగ్ మాట్లాడుతూ, 150 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ప్రేక్షకులను అలరించడానికి కేవలం 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని అన్నారు. "హీరోలు దేవుళ్ల లాంటి వారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాత చేయరు" అని ఆయన వ్యాఖ్యానించారు.

అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ ఒక తుపాను లాంటి వారని, ఆయన సినిమాను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. హీరోల పారితోషికం గురించి మాట్లాడే హక్కు తమకు లేదని, అయితే హీరోలు మరిన్ని చిత్రాలు చేయాలన్నదే తమ కోరిక అని తెలిపారు.

"ఏ వ్యాపారమైనా డిమాండ్ అండ్ సప్లయ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఫిలిం ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో నేను లేను. థియేటర్ల బంద్ వార్త విని నేను కూడా ఆశ్చర్యానికి లోనయ్యాను" అని సునీల్ నారంగ్ అన్నారు. థియేటర్ల విషయంలో 'ఆ నలుగురు' అంటూ ఎవరూ లేరని, థియేటర్లు వాటి యజమానుల వద్దే ఉన్నాయని, పర్సంటేజ్ విధానం సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Sunil Narang
Telangana Film Chamber
Pawan Kalyan
Telugu Film Industry

More Telugu News