AP Teachers Transfers: ఏపీ చరిత్రలో తొలిసారిగా... ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు

AP Teachers Transfers First Time 4851 Teachers Get Promotions
  • ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో పారదర్శకతకు ప్రభుత్వ ప్రాధాన్యం
  • ఆన్‌లైన్ విధానంపై వదంతులు నమ్మవద్దని విద్యాశాఖ స్పష్టీకరణ
  • ఈ ఏడాది ఇప్పటికే 35,235 బదిలీలు, 4,853 ప్రమోషన్లు పూర్తి
  • టీచర్లకు వెసులుబాటుగా పలు నూతన సాంకేతిక సౌకర్యాల కల్పన
  • మాన్యువల్ కౌన్సెలింగ్‌లోని ఇబ్బందులకు ఆన్‌లైన్‌తో చెక్
  • 2015 నుంచే వెబ్ ఆధారిత బదిలీల ప్రక్రియ విజయవంతం
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా, కేవలం సర్వీసునే ప్రామాణికంగా తీసుకుంటున్న ఈ ఆన్‌లైన్ విధానంపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు స్పష్టం చేసింది. పైరవీలకు, రాజకీయ జోక్యానికి ఆస్కారం లేదని భరోసా ఇచ్చింది.

ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా, ఎటువంటి రాజకీయ ప్రమేయానికి తావులేకుండా ఆన్‌లైన్ ద్వారా 4,853 పదోన్నతులు, 35,235 బదిలీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో పలు దఫాలుగా చర్చించి, వారి సూచనలు పరిగణనలోకి తీసుకుని, ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం "టీచర్ ట్రాన్స్‌ఫర్స్ యాక్ట్"ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం అన్ని బదిలీలను కేవలం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు.

2025 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఆన్‌లైన్ బదిలీల్లో ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం పలు నూతన సాంకేతిక సౌకర్యాలు ప్రవేశపెట్టారు. మండల కేంద్రం నుంచి పాఠశాల దూరం, క్లస్టర్లలో ఖాళీల వివరాలు స్పష్టంగా చూపుతున్నారు. ఆప్షన్లను పలుమార్లు మార్చుకునే వీలు, అవగాహన వీడియోలు, సాంకేతిక సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. తప్పనిసరి బదిలీ అయ్యేవారు తమ ఆప్షన్లను ఖచ్చితంగా ఖరారు చేయాల్సి ఉంటుంది.

గతంలోని మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ఖాళీల వివరాలు వెంటనే తెలియక సీనియర్లు నష్టపోవడం, రోజుకు కొద్దిమందికే కౌన్సెలింగ్ సాధ్యమవడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి వేచి చూడాల్సిన ఇబ్బందులు వంటి సమస్యలుండేవని విద్యాశాఖ గుర్తుచేసింది. ఆన్‌లైన్ విధానం వీటికి తెరదించి, సమయం, శ్రమ ఆదా చేయడంతో పాటు, పైరవీలకు పూర్తి అడ్డుకట్ట వేసిందని అధికారులు స్పష్టం చేశారు. సీనియారిటీకి న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 1998లో బదిలీల కోసం కౌన్సెలింగ్ విధానం ప్రారంభం కాగా, మాన్యువల్ పద్ధతిలోని లోపాలను అధిగమించేందుకు 2015లో తొలిసారిగా వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ విధానం ఉపాధ్యాయులలో నమ్మకాన్ని పెంపొందించింది. గత ప్రభుత్వం కూడా ఇదే ఆన్‌లైన్ విధానాన్ని కొనసాగించగా, ప్రస్తుత ప్రభుత్వం దానిని మరింత మెరుగుపరిచి, సాంకేతికత సాయంతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.
AP Teachers Transfers
Teachers Transfers Act
AP Education Department
Online Transfers
Teacher Promotions
Andhra Pradesh Education
School Education
Education Technology
AP Government
Education Reforms

More Telugu News