Jogi Ramesh: మా ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే: జోగి రమేశ్

Jogi Ramesh Says Amaravati a Reason for YSRCP Defeat
  • రాజధాని అంశంపై తమ పార్టీ అధినేత జగన్‌తో చర్చిస్తామన్న మాజీ మంత్రి జోగి రమేశ్
  • జగన్మోహనరెడ్డి నేతృత్వంలో అమరావతి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్న జోగి రమేశ్
  • రమేశ్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలను విశ్లేషించారు. ఈ క్రమంలో జోగి రమేశ్ రాజధాని విషయంలో తమ పార్టీ స్టాండ్‌కు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో జోగి రమేశ్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజధాని విషయంలో తమ పార్టీ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన జోగి రమేశ్.. ఈ విషయంపై తమ పార్టీ అధినేతతోనూ చర్చిస్తామని అన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులను తీసుకువచ్చారని చెప్పారు. కానీ అది రాష్ట్ర ప్రజలకు నచ్చలేదని అన్నారు. తమ పార్టీ ఓటమికి అమరావతి అంశం కూడా ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు.

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. తమ పార్టీ నాయకుడు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. తాము చెప్పినట్లుగా చంద్రబాబు కూడా విశాఖ ఆర్ధిక రాజధాని అంటున్నారని గుర్తు చేశారు. తాము ఆశించినట్లే ఇప్పుడు విశాఖను ఒక రాజధానిగా కూటమి ప్రభుత్వం చేసిందన్నారు.

అక్కడ కూడా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చేయాలన్నదే తమ పార్టీ ఉద్దేశంగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జగన్ చాలా సార్లు చెప్పారన్నారు. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కావొద్దనేదే జగన్ ఉద్దేశమని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని జగన్ చూశారని జోగి రమేశ్ అన్నారు. ప్రస్తుతం జోగి రమేశ్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Jogi Ramesh
YS Jagan
Amaravati
Andhra Pradesh
AP Capital
Three Capitals
YSRCP Loss
2024 Elections
Visakhapatnam
Chandrababu Naidu

More Telugu News