Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

BRS MLA Maganti Gopinath Dies at 62
  • కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న గోపీనాథ్
  • 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిక 
  • చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత 
  • వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపు
  • ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభం
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

ఈ నెల 5వ తేదీన గోపీనాథ్‌ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్‌ అయినట్టు గుర్తించి సీపీఆర్ నిర్వహించారు. అనంతరం ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి నాడి, రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కాగా, గోపీనాథ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు.

టీడీపీతో రాజకీయ ప్రస్థానం
మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్ఫూర్తితో 1982లో ఆరంభమైంది. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ నియామక పత్రాన్ని స్వయంగా ఎన్టీఆరే ఆయనకు అందజేశారని చెబుతారు. అనంతరం, 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి రెండోసారి విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది, వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2022లో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Maganti Gopinath
BRS MLA
Jubilee Hills
Telangana Politics
Cardiac Arrest
AIG Hospital
TDP
NTR
Telangana Assembly Elections

More Telugu News