Real estate: ఏడాదికి 20 లక్షల సంపాదన.. అయినా గురుగ్రామ్ లో ఇల్లు కొనలేకపోతున్నా

Teche unable to buy Gurugram home despite 20 lakh salary
  • రియల్ ఎస్టేట్ ధరల మంటపై టెకీ వైరల్ పోస్ట్
  • సామాన్య మద్యతరగతి జీతగాడికి అందని ద్రాక్షగా మారిన ఫ్లాట్లు
  • నగరాల్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలపై నెటిజన్ల తీవ్ర చర్చ
  • హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని పలువురి వ్యాఖ్యలు
‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని సామెత.. అయితే, పెళ్లి మాటెలా ఉన్నా నగరాల్లో ఇల్లు కట్టడం, కొనడం సామాన్య మద్యతరగతి వ్యక్తి కలగానే మిగిలిపోతోంది. గురుగ్రామ్ సిటీలో ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఓ టెకీ వాపోతున్నాడు. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ సొంతంగా ఓ ప్లాటు కొనుక్కోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిస్థితిపై ఆయన స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ పోస్టు భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలపై తీవ్ర చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. అఖిలేశ్ అనే టెక్ నిపుణుడు తన స్నేహితుడి పరిస్థితిని వివరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశాడు. తన స్నేహితుడి వార్షిక వేతనం రూ.20 లక్షలు అని, పన్నులు, ఈపీఎఫ్ వంటివి పోను నెలకు సుమారు రూ.1.2 లక్షలు చేతికి వస్తాయని తెలిపాడు. అతను ఎలాంటి దుబారా ఖర్చులు చేయడని, సొంత కారు కూడా లేదని చెప్పాడు. పిల్లలు లేరని, కేవలం భార్య మాత్రమే ఉందని పేర్కొన్నాడు.

అయితే, గురుగ్రామ్‌లో అన్ని సౌకర్యాలున్న ఇల్లు కొనాలని ప్రయత్నిస్తే, ప్రాజెక్టుల ధరలు రూ.2.5 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయని అఖిలేశ్ తెలిపాడు. బ్రోచర్లలో ఇన్ఫినిటీ పూల్స్, జెన్ గార్డెన్స్, ఇటాలియన్ మార్బుల్స్, బయోమెట్రిక్ లిఫ్టుల వంటి ఆకర్షణలు ఉంటున్నాయని, ఇంత ఖరీదైన ఇల్లు కొంటే నెలనెలా జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతుందని, అత్యవసరాలకు కూడా డబ్బు మిగలదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. "భారత్‌ లో 95% మంది కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ, నా స్నేహితుడు సొంత నగరంలో ఇల్లు కొనలేకపోతున్నాడు" అని అఖిలేశ్ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నగరాల్లో ఇళ్ల ధరలపై విస్తృత చర్చకు దారితీసింది. "కొన్ని నగరాల్లో అధిక జీతాలు కూడా సరిపోవడం లేదు, ఇది ఆశ్చర్యంగా ఉంది" అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, "హైదరాబాద్‌లో ఓఆర్ఆర్ బయట ట్రిపులెక్స్ విల్లా ధరలు కూడా రూ.2.5 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఉన్నాయి. సామాన్యులకు ఇల్లు అనేది ఇక కలగానే మిగిలిపోతుంది" అని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొందరు తక్కువ ధరల్లో కూడా ఇళ్లు అందుబాటులో ఉన్నాయని, ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలని సూచించారు. మొత్తంగా, అధిక ఆదాయం ఉన్నప్పటికీ సొంతిల్లు సమకూర్చుకోవడం కష్టతరమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Real estate
Gurugram property prices
home ownership India
property market
high cost of living
Indian cities real estate
middle class housing
housing affordability
Gurgaon real estate

More Telugu News