Raja Raghuwanshi: ఇండోర్ నవ దంపతుల మిస్సింగ్ మిస్టరీ: ముగ్గురు వ్యక్తులతో చూశానన్న గైడ్.. కేసులో కొత్త మలుపు!

Indore Couple Missing Tourist Guide Claims Seeing Them With Three Men
  • మేఘాలయ హనీమూన్‌లో ఇండోర్ జంట అదృశ్యం
  • లోయలో భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యం
  • భార్య సోనమ్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గాలింపు
  • అదృశ్యమైన రోజు ముగ్గురు వ్యక్తులతో చూశానన్న టూరిస్ట్ గైడ్
  • హత్య కోణంలో దర్యాప్తు, రక్తపు మరకలతో కత్తి స్వాధీనం
  • సోనమ్ బతికే ఉందని, సీబీఐ దర్యాప్తు కోరుతున్న కుటుంబం
మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లిన ఇండోర్ జంట అదృశ్యం ఘటనలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మే 23న కనిపించకుండా పోయిన ఈ దంపతుల్లో భర్త మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యం కాగా, భార్య ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా వెలుగులోకి వస్తున్న వివరాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

ముగ్గురు వ్యక్తులతో దంపతులు? 
ఈ జంట అదృశ్యమైన రోజున, వారి వెంట మరో ముగ్గురు పురుషులు ఉన్నట్లు ఒక టూరిస్ట్ గైడ్ తాజాగా వెల్లడించడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆల్బర్ట్ ప్డే అనే గైడ్.. రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్‌లను మే 23న ఉదయం సుమారు 10 గంటల సమయంలో నాన్‌గ్రియాట్ నుంచి మావ్లాఖియాట్ వైపు 3,000 మెట్లకు పైగా ఎక్కుతుండగా చూశానని తెలిపారు. అంతకు ముందు రోజు తాను వారికి గైడ్‌గా సేవలందిస్తానని చెప్పగా, వారు సున్నితంగా తిరస్కరించారని ఆల్బర్ట్ గుర్తు చేసుకున్నారు.

"ఆ నలుగురు పురుషులు ముందు నడుస్తుండగా, మహిళ వారి వెనుక వస్తున్నారు. ఆ నలుగురు హిందీలో మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు ఖాసీ, ఇంగ్లిష్ మాత్రమే తెలుసు కాబట్టి వారేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు" అని ఆల్బర్ట్ ప్డే చెప్పినట్లు పీటీఐ ఉటంకించింది. తాను మావ్లాఖియాట్ చేరుకునే సమయానికి వారి స్కూటర్ అక్కడ లేదని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశానని గైడ్ పేర్కొన్నాడు. నవ దంపతులు అద్దెకు తీసుకున్న స్కూటర్ మావ్లాఖియాట్‌లోని పార్కింగ్ స్థలానికి చాలా కిలోమీటర్ల దూరంలో సోహ్రారిమ్ వద్ద తాళం చెవితో సహా వదిలేసి ఉండటం గమనార్హం.

భర్త మృతదేహం లభ్యం.. హత్య అనుమానాలు
రోజుల తరబడి గాలించిన అనంతరం జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని సహాయక సిబ్బంది ఒక లోయలో గుర్తించారు. అతని శరీరంపై ఉన్న బంగారు ఉంగరం, మెడలోని గొలుసు మాయమవడం హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఆ మరుసటి రోజు సమీపంలోనే రక్తపు మరకలతో కూడిన ఒక కత్తిని కూడా అధికారులు కనుగొన్నారు. రెండు రోజుల తర్వాత సోహ్రారిమ్ నుంచి రాజా మృతదేహం దొరికిన లోయకు మధ్యలో ఉన్న మావ్క్మా గ్రామంలో దంపతులు ఉపయోగించిన రెయిన్‌కోట్ ఒకటి లభ్యమైంది. ఈ ఆధారాలన్నీ రాజా హత్యకు గురై ఉండవచ్చని సూచిస్తుండటంతో, అతని భార్య సోనమ్ కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పర్వతారోహకులు, జాగిలాలు, డ్రోన్లతో గాలిస్తున్నారు. అయితే, క్లిష్టమైన భూభాగం, అతి భారీ వర్షాలు, కొన్ని అడుగుల దూరం కూడా కనిపించకుండా అడ్డుకుంటున్న పొగమంచు వాతావరణం గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.

 సీసీటీవీ ఫుటేజ్‌లో చివరి దృశ్యాలు 
దంపతుల అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి రెండు సీసీటీవీ ఫుటేజ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఒక ఫుటేజ్‌లో దంపతులు అద్దెకు తీసుకున్న స్కూటర్‌పై వెళ్తున్నట్లు కనిపించగా, మరొకటి వారు ట్రిప్‌కు బయలుదేరే ముందు తమ వస్తువులలో కొన్నింటిని తీసుకుంటున్న గెస్ట్‌హౌస్‌లోనిది. టీ7 న్యూస్ సేకరించిన సమాచారం ప్రకారం.. మే 22న, అంటే వారు అదృశ్యం కావడానికి ఒక రోజు ముందు రాజా, సోనమ్ ఒక గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. అక్కడ గదులు అందుబాటులో లేకపోవడంతో కనీసం తమ లగేజీనైనా భద్రపరచాలని గెస్ట్‌హౌస్ సిబ్బందిని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాన్‌గ్రియాట్‌లోని ప్రసిద్ధ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్‌ను సందర్శించి తిరిగి వస్తామని వారు హామీ ఇవ్వడంతో హోటల్ సిబ్బంది లగేజీని తనిఖీ చేసి భద్రపరచడానికి అంగీకరించారు. వీడియోలో సోనమ్ తమ స్కూటర్‌పై రెయిన్‌కోట్ వేస్తున్నట్లు కూడా కనిపించింది.

ప్రభుత్వంపై సోనమ్ కుటుంబం ఆరోపణలు 
షిల్లాంగ్‌లో మకాం వేసిన సోనమ్ సోదరుడు గోవింద్ రాష్ట్ర ప్రభుత్వం తమ సోదరి ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆమె చనిపోయిందన్నట్లుగా గాలిస్తున్నారని ఆరోపించారు. "సోనమ్ బతికే ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాము. వారు మాత్రం ఆమె చనిపోయినట్లుగా వెతుకుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ లేదా ఇతర ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ఆపరేషన్‌పై తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సియెమ్ మాట్లాడుతూ, "మేము మా శాయక్తులా ప్రయత్నిస్తున్నాం.. మా సిబ్బంది విశ్రాంతి లేకుండా అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన జాగిలాలను ఉపయోగిస్తున్నారు. గాలింపు కొనసాగుతుంది" అని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, సోనమ్ ఆచూకీ లభిస్తుందనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
Raja Raghuwanshi
Indore couple missing
Meghalaya honeymoon
Sonam Raghuwanshi
Nongriat
Double Decker Root Bridge
Mawlyngkhang
Shillong
missing persons case
murder investigation

More Telugu News