Israel Defense Forces: ఇదిగో ఇందుకే మేం దాడులు చేస్తున్నాం.. ఇజ్రాయెల్ సైన్యం

Israel Defense Forces Justifies Gaza Raids
  • గాజా ఆసుపత్రి కింద హమాస్ సొరంగం వీడియో షేర్ చేసిన ఐడీఎఫ్
  • హమాస్ ఉగ్రవాదులు సామాన్యులను రక్షణ కవచంగా వాడుకుంటున్నారని ఆరోపణ
  • ప్రజలను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడుతోందని ఫైర్
గాజాలో హమాస్ ను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్–ఐడీఎఫ్) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసుపత్రులపైనా ఐడీఎఫ్ దాడులు చేస్తోందని, అమాయక ప్రజలను చంపేస్తోందంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ దేశాధినేతలు ఇప్పటికే ఇజ్రాయెల్ తీరును తప్పుబడుతున్నారు. ప్రధాని నెతన్యాహు ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా గాజాపై దాడులను సమర్థించుకుంటూ ఐడీఎఫ్ తాజాగా ఓ వీడియో బయటపెట్టింది. ఖాన్ యూనిస్‌లోని ఒక కీలకమైన ఆస్పత్రి కింద హమాస్ సొరంగం కనుగొన్నామంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వీడియోలోని దృశ్యాలను గమనిస్తే.. యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్‌లో ఓ సొరంగం కనిపిస్తోంది. దీనిని హమాస్ కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తోందని, ఇక్కడి నుంచే ఇజ్రాయెల్ పై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఐడీఎఫ్ ఆరోపించింది. సొరంగంలో ఆయుధాలు, నిఘా సామగ్రి ఇతర పరికరాలు ఉంచిన కంట్రోల్ రూములు కూడా కనిపిస్తున్నాయి.

హమాస్ తన ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులను స్థావరాలుగా వాడుకుంటూ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ఐడీఎఫ్ ఆరోపించింది. 2023లోనూ ఇదే విధంగా గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. వాటిని ధ్వంసం చేయడానికి తాము దాడులు చేసినప్పుడు అక్కడ ఉన్న అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని వివరించింది.
Israel Defense Forces
IDF
Gaza
Hamas
Israel
Khan Yunis
European Hospital
Netanyahu
Al-Shifa Hospital
Terrorism

More Telugu News