Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏపీ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Visits Maganti Gopinath Family Expresses Condolences
  • మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారా లోకేశ్, బ్రాహ్మణి
  • మాదాపూర్ లోని గోపీనాథ్ నివాసానికి వెళ్లి నివాళి అర్పించిన లోకేశ్, బ్రాహ్మణి
  • గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైనం
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి కూడా మాగంటి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారు హైదరాబాద్ మాదాపూర్‌లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన అనంతరం, తీవ్ర విషాదంలో ఉన్న గోపీనాథ్ కుటుంబ సభ్యులను లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లోకేశ్ పక్కనే కూర్చున్నానారు.

అనంతరం, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందడం దిగ్భ్రాంతికి గురిచేసింది, ఇది చాలా బాధాకరం" అని ఆయన పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీతో మాగంటి గోపీనాథ్‌కు ఉన్న అనుబంధాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు. "తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు" అని లోకేశ్ తెలిపారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. "వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ లోకేశ్ తన సంతాప సందేశంలో వెల్లడించారు.
Maganti Gopinath
Nara Lokesh
Jubilee Hills MLA
Telangana Politics
KCR
KTR
TDP
Heart Attack
Condolences
Andhra Pradesh

More Telugu News